ఉద్యమం నుంచే బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు

ఉద్యమం నుంచే బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు

ఉద్యమ సమయం నుంచి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు  మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ తో కలిసి అనేక వేదికలను పంచుకున్నామన్నారు.జేఏసీలో బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళ పెద్దలతో కలిసి పనిచేమన్నారు. బీజేపీలో తనకు కొత్త కాదని ..అంతా పాత పరిచయాలేనని తెలిపారు. పార్టీ నుంచి తాను బయటికి రావడానికి గత రెండు నెలల్లో.. జరిగిన పరిణామాలు కారణం కాదని అనేక సందర్భాలలో ప్రజల సమస్యలపై నేను ప్రస్తావిస్తూ వచ్చానని తెలిపారు. అది వాళ్ళకి నచ్చలేదన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్థంభాలని చెప్పారు ఈటల.

కార్యకర్తలు పని చేస్తేనే సర్పంచ్ నుంచి ఎంపీ వరకు విజయాలు సాధిస్తారన్నారు ఈటల రాజేందర్. ఆత్మగౌరవం ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడిందని.. ఇక్కడి ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి పని చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. హుజురాబాద్ ప్రజలకు పార్టీ జండా తో సంబంధం లేదన్నారు ఈటల. ఎన్నడూ లేని విధంగా ఇక్కడి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని అన్నారు.

మీరు పెట్టిన ఫ్లెక్సీల్లో చెబుతున్న పథకాల వెనుక నేను కూడా సూత్రధారి అనే విషయం మర్చిపోవద్దన్నారు. అధికారులు చట్టానికి లోబడి పని చేయాలని సూచించారు. బీజేపీకి మద్దతు ఇచ్చే వారి ఇంటికి వెళ్లి కొంత మంది అధికారులు వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తాము ఎవరి జోలికి పోమని..అయితే మా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారాన్ని, డబ్బులను, అణచివేతను నమ్ముకున్నారు. నేను కాషాయ జెండాను నమ్ముకున్నానని తెలిపారు ఈటల.
తెలంగాణ ఉద్యమంలో హుజురాబాద్ పాత్ర ఎంతో ఉందన్నఈటల.. అందరం ఆశయ సాధన కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.