ఏపీలో నేటి నుంచి అమ్మఒడి

ఏపీలో నేటి నుంచి అమ్మఒడి

అమరావతి, వెలుగు: చదువుకు పేదరికంతో ఎవరు కూడా చదువు దూరం కావొద్దనే ఉద్దేశంలో ప్రవేశపెడుతున్న ‘జగనన్న అమ్మ ఒడి’ స్కీమ్‌ను ఏపీ వైఎస్‌ జగన్‌ గురువారం చిత్తూరులో ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో కీలకమైన ఈ స్కీమ్‌ అన్ని ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలలు, కాలేజీలకు వర్తించనుంది. పిల్లలను బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్‌ అకౌంట్లో సంవత్సరానికి రూ.15 వేలు వేయనున్నారు. ఈ పథకాన్ని ముందుగా ఒకటి నుంచి టెన్త్‌ స్టూడెంట్లకు ప్రకటించినా ఇంటర్‌ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. బడ్జెట్లలో ఈ పథకానికి రూ.6,500 కోట్లు కేటాయించారు.

ఇంటికే పింఛన్​ పైసలు

ఫిబ్రవరి నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని జగన్ ప్రకటించారు. గ్రామ వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటికి చేరుస్తామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వృద్ధులు పింఛన్​ కోసం పంచాయతీ ఆఫీస్‌‌కు వచ్చి వేచి చూసే పరిస్థితి ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అమరావతిలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో పంచాయతీరాజ్ శాఖపై జగన్‌‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉగాది నాటికి రాష్ట్రంలో ఇండ్లు లేని 25 లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ సంఖ్య ఎక్కువైనా అర్హులైన వారందరికీ స్థలాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఇండ్ల స్థలాల్లో వచ్చే ఐదేండ్లలో ప్రభుత్వమే ఇండ్లు కట్టిస్తుందని తెలిపారు. ఏపీలో కొత్తగా 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో 3 వేలకు పైగా సిబ్బందిని నియమిస్తామన్నారు. అలాగే గ్రామ సచివాలయాలకు అవసరమైన పెండింగ్ ఉద్యోగాలు 15,971  మూడు నెలల్లో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.