సెక్రటేరియెట్ కు కేసీఆర్

సెక్రటేరియెట్ కు కేసీఆర్
  • రెండేళ్ల తర్వాత రానున్న సీఎం..
  • శంకుస్థాపన వేదిక పరిశీలన కోసం
  • 27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన
  • హెలిప్యాడ్ ప్లేస్ మంచిదన్న వాస్తు నిపుణులు

హైదరాబాద్, వెలుగు: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీఎం కేసీఆర్ సెక్రటేరియెట్ కు రానున్నారు. కొత్త సచివాలయ శంకుస్థాపనకు 27వ తేదీని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతకుముందే ఆయన ఒకట్రెండు సార్లు సెక్రటేరియెట్ కు వస్తారని అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన స్థలం, ఏపీ తిరిగిచ్చేసిన బ్లాక్ ల ను పరిశీలించే అవకాశాలున్నాయంటున్నారు. చివరిసారిగా 2017 ప్రారంభంలో ఆయన సెక్రటేరియెట్ కు వచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆయన సచివాలయం నుంచే పాలన కొనసాగించారు. అయితే, వాస్తు దోషం ఉందని వాస్తు నిపుణులు చెప్పడంతో రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారని అధికారులు అంటున్నారు. 2016 నవంబర్లో బేగంపేట ప్రగతి భవన్ను కట్టినప్పటి నుంచి అక్కడి నుంచే ఆయన పాలన చేస్తున్నారు. కేబినెట్ సమావేశాలు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లు, శాఖలపై సమీక్షలను అక్కడి నుంచే చేస్తున్నారు.

కొత్త సచివాలయ శంకుస్థాపన వేదికపై సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), రోడ్లు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎంవో, సీఎస్ కార్యాలయాలున్న సమతా బ్లాక్ (సీ బ్లాక్), బీ బ్లాక్తో పాటు హెలిప్యాడ్ స్థలాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. హెలిప్యాడ్ ఈశాన్యంలో ఉంది కాబట్టి అదే మంచి ప్లేస్ అని వాస్తు నిపుణులు చెప్పినట్టు సమాచారం. ఈ మూడింటిలో ఒక వేదికను ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారని అధికారులు చెబుతున్నారు. పూజ, భద్రతా ఏర్పాట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల కూర్చునేలా ఏర్పాట్లు చేయాలి కాబట్టి, తొందరగానే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

ఉగాది నాటికి ప్రారంభం?

కొత్త సచివాలయాన్ని 9 నుంచి 12 నెలల్లో పూర్తి చేసేలా కాంట్రాక్ట్ పొందిన కంపెనీకి కేసీఆర్ సూచిస్తారని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్ను ఆరు నెలల్లో పూర్తి చేసిన షాపూర్ జీ పల్లోంజి సంస్థకే కాంట్రాక్టు ఇచ్చేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.