- రాష్ట్రం నుంచి రెండో నాయకుడికి గవర్నర్ పదవి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మలక్ పేట నుంచి బీజేపీ తరఫున ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం బలంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి తొలితరం బీజేపీ నేతల్లో ముఖ్యుడిగా ఆయన ఎదిగారు. ఏబీవీపీ నుంచి విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన.. ఎమ్మెల్యేగా, బీజేపీ శాసన సభాపక్ష నేతగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు.
ఇప్పటికే రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా పనిచేస్తుండగా ఇప్పుడు ఇంద్రసేనా రెడ్డి గవర్నర్గా నియమితులయ్యారు. ఏబీవీపీ హైదరాబాద్ నగర కార్యదర్శిగా పని చేసిన సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన ఇంద్రసేనా రెడ్డి జైలుకు వెళ్లారు. బీజేపీ కన్నా ముందు జనతా పార్టీ రాష్ట్ర శాఖ యువజన విభాగం అధ్యక్షుడిగా, బీజేపీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర యువమోర్చా మొదటి అధ్యక్షుడిగా పని చేశారు. బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. రాష్ట్ర బీజేపీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1985లో నాదెళ్ల భాస్కర్ రావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999లోనూ గెలిచిన ఆయన బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేశారు. 2003 నుంచి 2006 వరకు బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
