పాకిస్తాన్‌‌‌‌ లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పాకిస్తాన్‌‌‌‌ లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
  • పెట్రోల్​ లీటర్ ​ధర రూ.458.41కి..డీజిల్ ​లీటర్ ​ధర రూ.520.35కి చేరింది
  • అమెరికా,-ఇరాన్ యుద్ధం ప్రభావమే కారణం

ఇస్లామాబాద్: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని ప్రభావంతో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను 43 శాతం, హై-స్పీడ్ డీజిల్ ధరను 55 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 

పెట్రోల్ లీటరుకు రూ.137.23 పెరిగి రూ.458.41కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) లీటరుకు రూ.184.49 పెరిగి రూ.520.35 కి చేరింది. కిరోసిన్ లీటరుకు రూ.34.08 పెరిగి రూ.457.80కి చేరింది. పెట్రోలియంశాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్​ధరల పెంపు అత్యంత కఠినమైన నిర్ణయంగా అభివర్ణించారు. దేశ ఆర్థిక క్రమశిక్షణను కాపాడటానికి, సబ్సిడీలను కేవలం అర్హులైనవారికే పరిమితం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత నెలలో పెట్రోల్ వినియోగం 8 శాతం, డీజిల్ వినియోగం 13 శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక వ్యవహారాల సలహాదారు ఖుర్రం షెహజాద్ తెలిపారు.

సామాన్యులకు రాయితీలు..

ధరల పెంపు వల్ల కలిగే భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని వర్గాలకు సబ్సిడీలను ప్రకటించింది. బైక్ యజమానులకు నెలకు 20 లీటర్ల వరకు.. లీటరుకు రూ. 100 రాయితీ ఇవ్వనుంది. రైతులకు పంట కోత సమయంలో అండగా నిలిచేందుకు ఎకరాకు రూ.1,500 ఒకేసారి ఆర్థిక సహాయం అందజేయనుంది. 

అంతర్రాష్ట్ర, సరుకు రవాణా వాహనాలకు లీటరుకు రూ. 100 రాయితీ, ట్రక్కు డ్రైవర్లకు నెలకు రూ.70 వేలు నేరుగా ఆర్థిక సాయం చేయనున్నారు. యుద్ధం కారణంగా ఇప్పటికే రూ.129 బిలియన్ల సబ్సిడీని భరించిన ప్రభుత్వం.. ఇకపై అదనపు భారాన్ని మోయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.