- నిరుడు అక్టోబర్ నాటికే పూర్తి కావాల్సిన పనులు
- అంచనాలు పెంచినా.. వెసులుబాటు కల్పించినా పనుల్లో లేని కదలిక
హైదరాబాద్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టింది. ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నా ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ప్రాజెక్టులో ప్యాకేజీ 3 పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 8.32 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థ ఏదో ఒక కొర్రీ పెడుతూనే ఉంది. దీంతో ప్యాకేజ్3 పనులు నత్తనడకన సాగుతున్నాయి.
దీంతో ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నిర్మాణ సంస్థ ప్రతినిధులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని వసతులు కల్పిస్తున్నా.. పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సీరియస్ అయినట్టు సమాచారం. పనులను ప్రాధాన్యపరంగా వేగంగా చేపట్టాలని తేల్చి చెప్పినట్టు తెలిసింది. పనుల్లో ఎలాంటి ఆలస్యాన్ని ఉపేక్షించబోమని, నిర్లక్ష్యం తగదని ఇటు అధికారులకూ ఆయన వార్నింగ్ ఇచ్చారని సమాచారం.
ఎన్ని అవకాశాలిచ్చినా..
ప్యాకేజీ 3 పనుల్లో భాగంగా 4.3 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పూర్తయింది. మరో 4 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేయాల్సి ఉంది. అయితే, అక్కడ భారీ బండరాయి అడ్డురావడంతో పనులపై నిర్మాణ సంస్థ పేచీ పెట్టింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే.. నిధులు సరిపోవని, కేటాయింపులను పెంచాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తూ వచ్చింది. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగానే ప్యాకేజీ3కి ఉన్న రూ.410 కోట్ల అంచనాలను రూ.780 కోట్లకు పెంచింది. బండరాయి ఉన్న చోట కంట్రోల్ బ్లాస్టింగ్‌కూ అనుమతులిచ్చింది. పాతరేట్ల ప్రకారమే పనులు చేయాలని కూడా స్పష్టం చేసింది. అందుకు ఓకే చెప్పిన నిర్మాణ సంస్థ.. నిరుడు అక్టోబర్ నాటికే కాలువ పనులు పూర్తి చేస్తామని చెప్పింది.
డెడ్ లైన్ మళ్లీ పెంచినా..
నిరుడు అక్టోబర్ నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. దానికి రెండు మూడు నెలల ముందే పనులను ఆపేసింది. పనులు చేయకుండా నిధులు విడుదల చేయాలంటూ పట్టుబట్టింది. దీంతో జోక్యం చేసుకున్న ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్.. సంస్థ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 2026 నాటికి కాలువ తవ్వకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పుడు కూడా సంస్థ మళ్లీ పేచీ పెట్టిందని అధికార వర్గాలు అంటున్నాయి. నిధుల కోసం ఆరాటం తప్ప.. చేయాల్సిన పనులపై సంస్థ ఫోకస్ పెట్టడం లేదని అంటున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కూడా ప్యాకేజీ3 పనులు ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
