- మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి
ఆదిలాబాద్/బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని, ఈ సభను సక్సెస్ చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షిషాతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బోథ్ నియోజకవర్గంలో రూ.1,200 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.300 కోట్లు, 2027 గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మైలురాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. సీఏం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, తాగునీరు వంటి సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు.
జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రేమ్ సాగర్ రావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ చార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నిర్మల్: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ తో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు.
బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం ఆలయంలో పూజలు నిర్వహించే స్థలం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఈవో విజయరామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి పాల్గొన్నారు.
