- సిటీలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి
- వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలి
- 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీపై ఫోకస్
- ఓఆర్ఆర్ లోపలి రోడ్లన్నీ ఎంఏయూడీ కిందకు
- ఫ్యూచర్ సిటీ ఆఫీసు బిల్డింగులను పూర్తిచేయాలి
- ఎంఏయూడీపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: అవుటర్ రింగ్ రోడ్డు పరిధి(కోర్ అర్బన్)లోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుమతులు, రుసుమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికి ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు. ఎంఏయూడీపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని.. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి బోర్డులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. ఉపాధిహామీలో రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులు రావని.. అలాంటి సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి.. ఆ లోపు దానిని తొలగించినా... అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు.
రోడ్లన్నీ ఎంఏయూడీ పరిధిలోకి..
కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటిని ఎంఏయూడీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వివిధ యాజమాన్యాల పరిధిలో రోడ్లు ఉండడంతో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని పేర్కొన్నారు. పనుల్లో ఏకరూపత, పనుల వేగవంతానికి ఇది తోడ్పడుతుందని సీఎం అన్నారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని.. వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతో పాటు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హోటళ్లకు రేటింగ్స్..
కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించేలా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తెలుసుకొని పరిష్కరించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టడంతోపాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేసి రేటింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిటీలో50 అంతస్తులకుపైగా భవంతుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అధునాతన సామగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. నగరంలోని సర్కిల్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు. అదే సమయంలో యూనిపోల్స్‌ను ఏర్పాటు చేసి వాటిని మల్టీ యుటిలిటీ పోల్స్‌గా ఉపయోగించాలని తెలిపారు.
