- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
హైదరాబాద్, వెలుగు: కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఐఎన్‌టీయూసీ, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.5 వేల వరకు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్లెక్సీలకు కార్మికులు క్షీరాభిషేకం చేశారు. సీఎం రేవంత్, మంత్రి వివేక్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, పీసీసీ లేబర్ సెల్ ఇన్చార్జి జగదీశ్వర్, అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ సమీర్, నాయకులు నరసింహా రెడ్డి, అఖిల్, మల్లేశ్, గంగాధర్, గిరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు. దీనివల్ల రాష్ట్రంలోని 1.11 కోట్ల కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
