బండి సంజయ్...నీ కొడుకును తీసుకుని పీఎస్ కు రా : సీఎం రేవంత్

బండి సంజయ్...నీ కొడుకును తీసుకుని పీఎస్ కు రా : సీఎం రేవంత్

బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం  తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో  మే 15న ఓ  మీడియా నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసుపై  కీలక వ్యాఖ్యలు చేశారు.

కొడుకు మీద కేసు నమోదైతే బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలా? అని  సీఎం రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి హోదాలో ఉండి.. హుందాగా వ్యవహరించాల్సిన అవసరం సంజయ్‌పై ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయడం కంటే చట్టం ముందు వాస్తవాలను తేల్చుకోవాలని  రేవంత్  సూచించారు.బండి సంజయ్ విచారణకు సహకరించాలని, ఆయన తన కొడుకును తీసుకుని స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వస్తేనే ఆయనకు గౌరవం ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణను ఎదుర్కోకుండా ఉండటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.

మే   8వ తేదీ రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 9వ తేదీనే విచారణ ప్రారంభించి, సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశామని.. 11వ తేదీన నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన భద్రతలో 10 వేల మంది పోలీసులు బిజీగా ఉన్నప్పటికీ.. కేసు విచారణలో ఎక్కడా జాప్యం జరగలేదని ఆయన గుర్తు చేశారు.

తొందరపడి వెయ్యి మంది పోలీసులతో వెళ్లి ఇంటిపై పడితే.. కక్ష సాధింపు అని విమర్శలు చేసేవారు. అందుకే చట్టప్రకారం, నిశితంగా ఆధారాలు సేకరిస్తున్నాం అని రేవంత్ అన్నారు. సినిమా వాళ్లైనా, రాజకీయ నాయకులైనా తనకు ఎవరూ మినహాయింపు కాదని.. కేసు పెట్టినప్పుడే తన కమిట్‌మెంట్ ఏంటో అర్థం చేసుకోవాలని ప్రత్యర్థులకు చురకలు అంటించారు.

బండి సంజయ్ తీరు నైతికంగా తప్పని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొడుకు చేసిన తప్పిదం వల్ల తలవంపులు వచ్చినా.. ధైర్యంగా నిలబడి విచారణను ఎదుర్కోవాలని సూచించారు. కొడుకును తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాలి. స్టేషన్‌కు వచ్చి సమాధానం చెప్పాలి తప్ప పారిపోవద్దు. నోటీసులకు స్పందించకపోతే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు అని హెచ్చరించారు.

బాధిత అమ్మాయికి సంబంధించి రెండు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని.. వాటన్నింటినీ పోలీసులు లోతుగా విచారించాల్సి ఉందన్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన కాబట్టి ఆధారాల సేకరణకు సమయం పడుతుందని.. ఒక్క రోజు ఆలస్యమైనా సరే తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బాధితులకు తమ ప్రభుత్వం 100 శాతం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాలను నియంత్రించడంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా పోక్సో కేసుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.