ఆర్టీసీ కార్మికులు పోతరా.. పంపిద్దమా?

ఆర్టీసీ కార్మికులు పోతరా.. పంపిద్దమా?
  • వాలంటరీ, కంపల్సరీ రిటైర్మెంట్​ స్కీంలపై రాష్ట్ర సర్కార్​ ఆలోచన
  • పరిశీలించాలని సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం!
  • ఆర్థిక భారం పడకుండా ఉండే స్కీంకే మొగ్గు
  • ఆర్టీసీ ఆస్తులు అమ్మి  ప్యాకేజీ ప్రకటించే ప్రతిపాదన?
  • ‘సమ్మె ఇల్లీగల్​’ సాకుతో మూకుమ్మడిగా తొలగించడంపైనా కసరత్తు
  • రేపు, ఎల్లుండి జరిగే కేబినెట్  భేటీలో తుది  నిర్ణయం ప్రకటించే చాన్స్​

హైదరాబాద్, వెలుగుఆర్టీసీలో కార్మికులను తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించినట్లు తెలిసింది. వయసువారీగా కార్మికుల లెక్కలు తీయాలని సూచించినట్లు సమాచారం. మంగళవారం ప్రగతిభవన్ లో ఆయన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, రవాణా, ఆర్టీసీ అధికారులతో భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయో తేల్చాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఏ స్కీం అమలు చేస్తే కార్మికులను ఇంటికి పంపొచ్చన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 2న జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో 5,100  ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చారు. ఆ బస్సులు రోడ్డెక్కితే ఆర్టీసీలోని సగం బస్సులు మూలకు పడుతాయి. అదే జరిగితే ఆర్టీసీలోని సగం మంది కార్మికులకు పని ఉండదు. అందుకే కార్మికులు సమ్మె విరమించి డ్యూటీలో చేరుతామని డిపోల ముందు బైఠాయించినా పట్టించుకోవడం లేదు.

రెండు ప్లాన్లు

ప్రస్తుతం ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్​తో కలిపి 49,733 మంది వరకు ఉన్నారు. వీరందరిని డ్యూటీలో చేర్చుకోవడం తలకు మించిన భారమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకని వారిని ఇంటికి పంపించే స్కీం రెడీ చేసుకుని రావాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ఏ స్కీం అమలు చేయాలో లెక్కలు వేసే పనిలోపడ్డారు. సంస్థలో కార్మికులను కుదించడానికి వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీం) అమలు చేయాలా.. సీఆర్ఎస్ ( కంపల్సరీ రిటైర్మెంట్​ స్కీం) అమలు చేయాలా.. అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ రెండింటిలో తక్కువ ఆర్థిక భారం పడే స్కీం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.గురువారం నాటికి రెండు ప్లాన్లను రెడీ చేసుకుని కేబినెట్ ముందు పెడుతామని ఆయన అన్నారు. గురు, శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. ఆర్టీసీ కార్మికులను తొలగించేందుకు ఏదైనా స్కీం, దాని ప్యాకేజీని ఈ భేటీలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.

వీఆర్ఎస్ తో ఎంత భారం?

వీఆర్ఎస్​ను ఆర్టీసీలో అమలు చేస్తే ఏ మేరకు సంస్థపై భారం పడుతుందన్న దానిపై  రవాణా, ఆర్టీసీ అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈ స్కీం అమలు చేయాలంటే కార్మికుల సహకారం తప్పనిసరి. స్కీం ప్రకటించాక.. దాని బెనిఫిట్స్  మెరుగ్గా ఉన్నాయని కార్మికులు భావించినప్పుడే అంతో ఇంతో ఫలితం ఉంటుంది. లేకపోతే అది అమలుకావడం కష్టం. పైగా ఇష్టం ఉన్న ఉద్యోగులు మాత్రమే స్కీంకు దరఖాస్తు చేసుకుంటారు. ఇష్టం లేనివారు దూరంగా ఉంటారు. అదేవిధంగా ఇందులో చేరాలని బలవంతపెట్టేందుకు చాన్స్​ ఉండదు. పెద్దస్థాయిలో ఆర్టీసీ కార్మికులను ఈ పథకం కింద ఇంటికి పంపడం సాధ్యంకాదని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వీఆర్ఎస్ కింద రిటైర్మెంట్ ఇవ్వాలంటే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు ప్రకటించాల్సి ఉంటుందని, అలాంటి ప్రయోజనాలు ఇవ్వాలంటే సంస్థపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. ఉదాహరణకు.. ఒక కార్మికుడు 32 ఏండ్ల వయసులో డ్యూటీలో చేరి 18 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే అతడికి ఇంకా 8 ఏండ్ల సర్వీస్  మిగిలి ఉంటుంది. ఆ కార్మికుడు నెలకు రూ. 30 వేల జీతం తీసుకుంటుంటే.. అతను కోల్పోతున్న 8 ఏండ్ల సర్వీస్ కాలానికి సుమారు రూ. 30 లక్షల ప్యాకేజీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల్లో 50 ఏండ్లు నిండిన వారు సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. వీరందరినీ వీఆర్​ఎస్​ ఇచ్చి పంపాలంటే సగటున రూ. 30 లక్షల ప్యాకేజీ అమలు చేయాల్సి ఉంటుంది. అంటే రూ. 5,100 కోట్ల నిధులు అవసరమవుతాయి.

సీఆర్ఎస్​తో ఎట్లుంటది?

ఆర్టీసీలో 50 ఏండ్లు నిండిన కార్మికులను వెంటనే ఉద్యోగాల నుంచి తీసివేయాలంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్​ఎస్​) బెటర్ అని అధికారులు భావిస్తున్నారు. ఈ స్కీం కింద గ్రాట్యుటీ బెనిఫిట్స్​తోపాటు మరికొంత అమౌంట్ ను కలిపి ఉద్యోగులకు ప్యాకేజీగా ఇచ్చే వెసులు బాటు ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సీఆర్ ఎస్  ప్రకటిస్తే కచ్చితంగా ఇంత మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కార్మికులు డిమాండ్​ చేసే అవకాశం ఉండదని అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఈ స్కీం కింద ప్యాకేజీని ప్రకటించే వెసులుబాటు కార్మిక చట్టాల్లో ఉందని మరో అధికారి తెలిపారు. ‘పారిశ్రామిక వివాదల చట్టం 1954 లో సెక్షన్ 12.2 ప్రకారం సంస్థకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కార్మికులతో ఒప్పందం చేసుకుని పథకాన్ని అమలు చేయాలి. అది గుర్తింపు సంఘం కావొచ్చు.. లేదా కొన్ని కార్మిక సంఘాల గ్రూప్​తో కావొచ్చు.. ఒప్పందం చేసుకోవచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 50 ఏండ్లు నిండిన కార్మికులందరినీ ఒకే సారి ఈ స్కీం కింద ఇంటికి పంపొచ్చని అన్నారు. ఉద్యోగికి ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి సంస్థ సీఆర్ఎస్ ప్రకటిస్తే కార్మికులు బెనిఫిట్స్ తీసుకుని రిటైర్ కావాల్సి ఉంటుందని చెప్పారు.

సమ్మె ఇల్లీగల్ అని చెప్పి మూకుమ్మడిగా..!

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇల్లీగల్ అని సీఎం కేసీఆర్ పదే పదే చెప్పారు. ఇదే అంశాన్ని అధికారులు హైకోర్టులో కూడా వాదించారు. సమ్మె ఇల్లీగల్  అని చెప్పి, పనితీరు సరిగ్గా లేదని కార్మికులందరినీ డ్యూటీలో నుంచి మూకుమ్మడిగా తొలగించే అవకాశం కూడా ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే.. సమ్మె ఇల్లీగల్​ అని లేబర్​ డిపార్ట్​మెంట్​ గతంలో ఇచ్చిన రిపోర్టును హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఏ నిర్ణయమూ లేబర్​ కోర్టుకు నివేదించాలని లేబర్​ కమిషనర్​ను ఆదేశించింది. త్వరలో లేబర్​ కోర్టుకు కమిషనర్​ నివేదిక అందజేయనున్నారు. ఆ కోర్టులో కేసు తేలేవరకు సర్కారు ముందడుగు వేయడానికి అవకాశం లేదు.

ముందుగా 20 వేల మంది ఇంటికి!

వీఆర్ఎస్ అమలు చేసినా, సీఆర్ఎస్  అమలు చేసినా ముందు   20 వేల మందిని ఇంటికి పంపొచ్చని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 50 ఏండ్లు దాటిన కార్మికులు 20 వేల మంది ఉంటారు. వీరందరికి ఈ స్కీముల్లో ఏదో ఒకటి వర్తించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

స్కీం ప్యాకేజీకి ఆర్టీసీ ఆస్తుల అమ్మకం

ఉద్యోగులను ఏ స్కీం కింద ఇంటికి పంపించినా ఆర్టీసీ ఆస్తులను అమ్మాల్సి ఉంటుంది. అయితే అవి ఏపీఎస్​ ఆర్టీసీ ఆస్తులని కార్మికులు వాదిస్తున్నారు. హైకోర్టులో సమ్మె కేసు విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటరీ జనరల్ అసలు ఆర్టీసీ విభజన కాలేదని అన్నారు. దీంతో ఆస్తుల పంపకం కాలేదని పరోక్షంగా వివరించారు. అయితే మంగళవారం జరిగిన సమీక్షలో ఆర్టీసీ ఆస్తులు ఏవో లెక్కలు తీయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్​లో కీలకమైన ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు ఉన్నాయి. అక్కడ కూడా విలువైన భూములు ఉన్నాయి. ఈ భూములు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయా..లేక వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నాయా.. లెక్కలు తీయాలని సీఎం సూచించినట్లు సమాచారం. రికార్డుల ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఆస్తులు ఉంటే వాటిని అమ్మేసి వీఆర్​ఎస్​/సీఆర్​ఎస్​ ప్యాకేజీ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  ఆస్తుల అమ్మకానికి లీగల్ గా అడ్డంకులు వస్తే .. ప్రభుత్వగ్యారెంటీతో ఆర్టీసీకి రుణం ఇప్పించి కార్మికులను ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.