పెరిగిపోతున్న నిరుద్యోగం.. పెరగని జీతాలు.. పడిపోతున్న రూపాయి.. పైకి ఎగబాకుతున్న ధరలు.. మారని బతుకులు.. మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు.. ఎటుచూసినా అవినీతి, అక్రమాలు.. ఒక్కటేమిటి? దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది. ఆ పార్టీనే ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’.
మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టిందీ పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది.
ద్రవ్యోల్బణంపై ధనుర్బాణం
దేశాన్ని పట్టిపీడిస్తున్న మరో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం. ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. గ్యాస్ ధరలు సామాన్యుడు భరించలేని స్థాయికి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లూ చుక్కలు చూపిస్తున్నాయి. బండ్లలో ఫ్యూయల్ కొట్టించాలంటే.. జేబులోని చమురును వదిలించుకోవాల్సిన దుస్థితికి పడిపోయింది. రూపాయి విలువ చరిత్రలోలేనంతగా పతనమవుతున్నది. సెంచరీ మార్క్‌కు చేరువ అవుతున్నది.
కానీ, అదే సమయంలో సామాన్యుడి జీతాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా తినే తిండి కూడా ధరాభారమైపోయింది. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనెల ధరలు మండిపోతున్నాయి. సరుకులు కొనేందుకే జీతంలో పావువంతుకుపైగా ఖర్చయిపోతున్నాయి. ఇటు ఆహార ద్రవ్యోల్బణంతో పాటు అటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపైనా ప్రభుత్వ విధానాలను సీజేపీ ప్రశ్నిస్తున్నది.
అవినీతి, లంచగొండితనంపై పోరు
ప్రభుత్వ ఆఫీసులకుపోతే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు చేతులు తడపనిదే పని కావడం లేదు. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. కష్టపడి సంపాదించి కొనుక్కున్న భూమి/ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ రావాలన్నా.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలన్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నా.. ప్రతి చోటా లంచం కామన్ అయిపోయింది.
‘ఫార్మాలిటీస్’ పేరుతో నిత్యం ప్రభుత్వాఫీసుల్లో ఎదురవుతున్న ఈ అవినీతి, లంచగొండితనంపైనా జెన్ జీలో అసహనం పెరిగిపోతున్నది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలూ తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తుండడంతో పోరాడే వేదికల కోసం వేచి చూస్తున్నారు నేటి యువతరం.
ఇంకా చాలా అంశాలపైనా యువత పోరాడుతోంది. తరాలు మారుతున్నా కుల వివక్షలు పోవడం లేదు. కొన్ని కులాల వారిని ఇప్పటికీ అంటరాని వారిగానే చూస్తున్నారు. దీనిపైనా యువగళం నిలదీస్తున్నది. ఓటు హక్కును గుంజేసుకుంటున్న తీరునూ ఎండగడుతున్నది. తాను ఎన్నుకున్న నేత.. అవకాశవాద రాజకీయాల కోసం మరో పార్టీలోకి జంప్‌కొట్టి పార్టీ ఫిరాయించే చర్యలనూ నిలదీస్తున్నది. మతరాజకీయాలను ప్రశ్నిస్తున్నది.
