- ఐదు రోజుల్లోనే కోటిన్నర మంది ఫాలోవర్లు
- సోషల్ మీడియాలో సంచలనం
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు
- యువతను బొద్దింకలతో పోల్చిన సీజేఐ
- ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం
- రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకూ మద్దతు
- నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు
- ఈ పార్టీ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టిన ‘ఎక్స్’ సంస్థ
హైదరాబాద్, వెలుగు: పెరిగిపోతున్న నిరుద్యోగం.. పెరగని జీతాలు.. పడిపోతున్న రూపాయి.. పైకి ఎగబాకుతున్న ధరలు.. మారని బతుకులు.. మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు.. ఎటుచూసినా అవినీతి, అక్రమాలు.. ఒక్కటేమిటి? దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది. ఆ పార్టీనే ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’. మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టిందీ పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ ఐదు రోజుల్లోనే కోటిన్నర మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు. గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్‌జీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలా మంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు.
ఇలా పుట్టింది..
ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు చెయ్యకుండా జర్నలిజం, యాక్టివిజం, సోషల్ మీడియా పేరుతో బొద్దింకల్లా వ్యవస్థపై పడుతున్నారని, వ్యవస్థను పరాన్నజీవుల్లాగా పీడిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్‌పై దుమారం రేగడంతో
మళ్లీ వివరణనిచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.
తాను కేవలం ఫేక్, బోగస్ డిగ్రీ పట్టాలతో న్యాయవ్యవస్థలోకి వచ్చిన వారి గురించి మాత్రమే మాట్లాడానని సీజేఐ చెప్పారు. యువత దేశాభివృద్ధికి పిల్లర్ల వంటివారని పేర్కొన్నారు. కానీ, అప్పటికే ఆయన వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్లిపోయాయి. ఆయన చేసిన ఆ కామెంట్సే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు కారణమైంది. ఐదు అంశాల ఎజెండాతో అభిజిత్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు.
అకౌంట్ హోల్డ్..
కాక్రోచ్ పార్టీ హ్యాండిల్‌ను ‘ఎక్స్’ హోల్డ్‌లో పెట్టింది. కారణాలు చెప్పకపోయినా పలు లీగల్ ఇష్యూస్‌తో అకౌంట్‌ను హోల్డ్ చేస్తున్నట్టు ఎక్స్ వెల్లడించింది. దీనిపై అభిజిత్ స్పందించారు. దీనిని తాను ముందే ఊహించానని, కచ్చితంగా బ్లాక్ చేయిస్తారనుకున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్క అకౌంట్‌ను బ్లాక్ చేసినా.. దానికి అనుబంధంగా మరిన్ని కొత్త అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కాక్రోచ్ పార్టీ యూపీ అనే కొత్త అకౌంట్‌ను సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆ పార్టీ అకౌంట్ యాక్టివ్గానే ఉంది. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన ‘కాక్రోచ్ పార్టీ యాంథెమ్’నూ విడుదల చేయడం గమనార్హం. అకౌంట్నైతే బ్లాక్ చేశారుగానీ.. మరి, తమ యాంథెమ్‌ను ఎలా ఆపుతారంటూ ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించారు. కాగా, కాక్రోచ్ జనతా పార్టీపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ, మహువా మొయిత్రా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధృవ్ రాఠీ, మనీశ్ సిసోడియా, అఖిలేశ్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, కీర్తి ఆజాద్, సంజయ్ సింగ్, అనురాగ్ కశ్యప్, దియా మీర్జా, ఊర్ఫి జావెద్, కొంకనాసేన్ శర్మ వంటి వాళ్లు దానిని ఫాలో అవుతున్నారు. ఆ పార్టీని సమర్థిస్తున్నారు. కాగా, ఇదంతా రాజకీయ డ్రామా అని ఎదుటి పార్టీ వాళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అభిజిత్ ఒకప్పుడు ఆప్ పార్టీకి పనిచేశారని చెబుతున్నారు. ఆప్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ఆయనే చూసుకునేవారు. పార్టీ తరఫున ఎదుటి పార్టీ వాళ్లపై సోషల్ మీడియా మీమ్స్‌ను తయారు చేసి ప్రచారం చేసేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కావాలనే ఇలాంటి ఒక హ్యాండిల్‌ను తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారని, ఆప్ ఓడిపోగానే అభిజిత్ అమెరికాకు పారిపోయారని పలువురు మండిపడుతున్నారు. ఈ పార్టీకి విదేశాల్లో ఉంటున్న ఇండియన్ల నుంచి కూడా విశేష స్పందన లభిస్తున్నది.
ద్రవ్యోల్బణంపై ధనుర్బాణం
దేశాన్ని పట్టిపీడిస్తున్న మరో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం. ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. గ్యాస్ ధరలు సామాన్యుడు భరించలేని స్థాయికి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లూ చుక్కలు చూపిస్తున్నాయి. బండ్లలో ఫ్యూయల్ కొట్టించాలంటే.. జేబులోని చమురును వదిలించుకోవాల్సిన దుస్థితికి పడిపోయింది. రూపాయి విలువ చరిత్రలోలేనంతగా పతనమవుతున్నది. సెంచరీ మార్క్‌కు చేరువ అవుతున్నది. కానీ, అదే సమయంలో సామాన్యుడి జీతాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా తినే తిండి కూడా ధరాభారమైపోయింది. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనెల ధరలు మండిపోతున్నాయి. సరుకులు కొనేందుకే జీతంలో పావువంతుకుపైగా ఖర్చయిపోతున్నాయి. ఇటు ఆహార ద్రవ్యోల్బణంతో పాటు అటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపైనా ప్రభుత్వ విధానాలను సీజేపీ ప్రశ్నిస్తున్నది.
అవినీతి, లంచగొండితనంపై పోరు
ప్రభుత్వ ఆఫీసులకుపోతే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు చేతులు తడపనిదే పని కావడం లేదు. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. కష్టపడి సంపాదించి కొనుక్కున్న భూమి/ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ రావాలన్నా.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలన్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నా.. ప్రతి చోటా లంచం కామన్ అయిపోయింది. ‘ఫార్మాలిటీస్’ పేరుతో నిత్యం ప్రభుత్వాఫీసుల్లో ఎదురవుతున్న ఈ అవినీతి, లంచగొండితనంపైనా జెన్ జీలో అసహనం పెరిగిపోతున్నది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలూ తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తుండడంతో పోరాడే వేదికల కోసం వేచి చూస్తున్నారు నేటి యువతరం. ఇంకా చాలా అంశాలపైనా యువత పోరాడుతోంది. తరాలు మారుతున్నా కుల వివక్షలు పోవడం లేదు. కొన్ని కులాల వారిని ఇప్పటికీ అంటరాని వారిగానే చూస్తున్నారు. దీనిపైనా యువగళం నిలదీస్తున్నది. ఓటు హక్కును గుంజేసుకుంటున్న తీరునూ ఎండగడుతున్నది. తాను ఎన్నుకున్న నేత.. అవకాశవాద రాజకీయాల కోసం మరో పార్టీలోకి జంప్‌కొట్టి పార్టీ ఫిరాయించే చర్యలనూ నిలదీస్తున్నది. మతరాజకీయాలను ప్రశ్నిస్తున్నది.
పోటీగా ఇంకో పార్టీ..
కాగా, ఈ పార్టీకి పోటీగా మరో పార్టీ కూడా పుట్టుకురావడం విశేషం. నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్అనే పేరిట మరో పార్టీని ఏర్పాటు చేశారు. వ్యవస్థకు తాము అతుక్కుపోమని, వ్యవస్థలోకి ఎంటరై లోపాలను ఎత్తిచూపి మారుస్తామని ఆ పార్టీ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఈ పార్టీ కూడా 8 హామీలను ఇచ్చింది. ‘‘క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తులను పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనివ్వం. చదువుకున్నవారినే చట్టసభల్లోకి తీసుకెళ్తం. నిధుల విషయంలో పారదర్శకత. పబ్లిక్కే రిపోర్టు కార్డులిస్తం. యువతకు ప్రథమ ప్రాధాన్యం. డిజిటల్ పాలన. స్థానికంగా మౌలికవసతులపై ఆడిటింగ్. అధికారానికన్నా జవాబుదారీతనానికే ప్రాధాన్యం’’ అని మేనిఫెస్టోలో పేర్కొనడం విశేషం.
నిరుద్యోగంపై ప్రశ్నల వర్షం..
ప్రస్తుతం దేశంలో లక్షల రూపాయలు పోసి చదువును కొనాల్సి వస్తోంది. ఉన్నత చదువులకు మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తిపాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. సరే అంత చదివినా.. ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో వస్తున్నాయా అంటే అదీ లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. గత నెలలో దేశ నిరుద్యోగ రేటు 5.1 శాతంగా ఉన్నది. ఏటా కొన్ని లక్షల మంది డిగ్రీలు, పీజీ పట్టాలు పట్టుకుని బయటకు వస్తున్నా.. ఆ మేర ఉద్యోగాలు ఉండడం లేదు. చదువుకు తగ్గ ఉద్యోగాలూ దొరకడం లేదు. దీంతో అన్ని లక్షలు ఖర్చు పెట్టాక కూడా ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ సీజేపీ ద్వారా నిలదీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా లీకేజ్ ముఠాలు పేపర్‌ను అమ్ముకున్నాయి. పేపర్ కొని రాసినోళ్లకు మంచి ర్యాంకులు వస్తే.. కష్టపడి చదువుకున్నోళ్లకు మాత్రం ఆ ఫలితం కనిపించడం లేదు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. దీనిపైనా సీజేపీ గళం విప్పింది. ప్రభుత్వ అసమర్థతను సోషల్ మీడియాలో ఎండగడుతున్నది. లీక్‌లు కాకుండా పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ నిలదీస్తున్నది.
ఇవీ సీజేపీ ఐదు హామీలు..
ఏ చీఫ్ జస్టిస్కూ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం
న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేయిస్తం. పౌరుల ఓటుహక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంట్ స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తం.
మంత్రి వర్గంలో సగం మహిళలకే ఇస్తం.
అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తం. గోది మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తం.
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏండ్లపాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తం
