కీసరగుట్ట ఆలయ అభివృద్ధికిసమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి: కలెక్టర్ మను చౌదరి ఆదేశం

కీసరగుట్ట ఆలయ అభివృద్ధికిసమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి: కలెక్టర్ మను చౌదరి ఆదేశం

కీసర, వెలుగు: కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పర్యాటక వారోత్సవాలలో భాగంగా బుధవారం కీసరగుట్టలో నిర్వహించిన హెరిటేజ్ వాక్​లో ఆయన పాల్గొన్నారు. రామలింగేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళికను ఆలయ చైర్మన్, ఈఓ వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. 

ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలయాభివృద్ధికి, పర్యాటక రంగాన్ని పెంచడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. దేశ, విదేశాల్లోని దాతల సహకారంతో పాటు ప్రభుత్వ నిధులతో భక్తులకు గతం కంటే మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆలయ చైర్మన్ తాటాకం వెంకటేష్ శర్మ, ఈఓ సుధాకర్ రెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.