23న బంగారు నగల వర్తకుల సమ్మె

23న బంగారు నగల వర్తకుల సమ్మె

ముంబయి: బంగారం, ఆభరణాల వర్తకులు ఈనెల 23న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. బంగారం, బంగారు ఆభరణాల్లో కల్తీ మోసాలకు చెక్ పెట్టేందుకు, తద్వారా స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను ప్రజలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గత జులై నెల 16వ తేదీ నుంచి దశలవారీగా దేశంలో హాల్‌ మార్కింగ్‌ నిబంధనలను అమలు చేస్తోంది. తొలిదశ కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ నిబంధన తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. 
అయితే దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్ కేంద్రాల కొరతకుతోడు కొన్ని సంక్లిష్ట నిబంధనలు విధించడాన్ని బంగారు ఆభరణాల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలు సవరించాలని కోరుతూ వచ్చిన వర్తక వ్యాపారులు ఇక లాభం లేదనుకుని ప్రభుత్వాన్ని కదిలించాలంటే సమ్మె ఒకటే మార్గమని నిర్ణయించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఒకేతాటిపైకి వచ్చిన అన్ని ప్రాంతాల బంగారం వర్తకులు, ఆభరణాల వ్యాపారులు ఈనెల 23న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. హాల్ మార్కింగ్ నిబంధనల అమలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ  ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్‌' (GJC) ఆధ్వర్యంలో ఈనెల  23వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చారు. పరిశ్రమలోని అన్ని సంస్థలు సంయుక్తంగా హాల్‌మార్కింగ్‌పై నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి.
స్పందించి నెలాఖరు వరకు గడువిచ్చిన బీఐఎస్ 
సమ్మె పిలుపుపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) స్పందించింది. సమ్మె విరమణ అంశాన్ని పరిశీలించాల్సిందిగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారి కోరారు. దాదాపు అన్ని అసోసియేషన్లు కొత్త విధానాన్ని ఆహ్వానిస్తున్నాయని పేర్కొన్న ఆయన ఏవో కొన్ని సంస్థలు వ్యతిరేకించడం సరికాదని పేర్కొన్నారు. హాల్‌ మార్కింగ్‌ నిబంధనలు అమలు చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఇస్తామని, ఆ తరవాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.