- 23 మందితో మంత్రివర్గాన్ని విస్తరించిన విజయ్
- 33కు చేరిన మంత్రుల సంఖ్య
- ఏఐ కోసం మంత్రిత్వ శాఖ
చెన్నై:దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీ చేరింది. సీఎం విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించగా.. గురువారం లోక్ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. కిల్లియూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత ఎస్. రాజేశ్ కుమార్, మేలూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ పరిణామంతో దాదాపు 60 ఏండ్ల తర్వాత తమిళనాడు పాలనలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అడుగుపెట్టింది. కాగా, కాంగ్రెస్‌పార్టీ దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేరడం పట్ల కాంగ్రెస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ద్రవిడ ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే వేర్వేరు సమయాల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చినా మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు కల్పించలేదు. 1963 నుంచి 1967 వరకు అప్పటి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చివరి సారిగా అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎం. భక్తవత్సలం సీఎంగా పనిచేశారు.
33 మందితో విజయ్ మంత్రివర్గం
ఈ నెల 10న విజయ్ సీఎంగా, 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం 21 మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్ఎమ్మెల్యేలతో తన మంత్రివర్గాన్ని విజయ్ విస్తరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. దీంతో మంత్రుల సంఖ్య 33కి చేరింది. మంత్రులుగా మరో ఇద్దరికి అవకాశం ఉండగా.. వీసీకే, ఏయూఎంఎల్ పార్టీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే శుక్రవారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. కాగా, అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం నేతృత్వంలోని దాదాపు 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో, ఈ నెల13న జరిగిన విశ్వాస తీర్మానంలో టీవీకే ప్రభుత్వం విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఏఐ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. వెళచ్చేరి నియోజకవర్గం నుంచి గెలిచిన టీవీకే ఎమ్మెల్యే ఆర్. కుమార్ కు ఏఐతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. కేరళ తర్వాత ఈ విధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
రాష్ట్ర గీతం ఆలపించడంపై వివాదం
లోక్‌భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో తమిళ రాష్ట్ర గీతాన్ని చివర్లో ఆలపించడంపై వివాదం చెలరేగింది. వందేమాతరం, జాతీయ గీతం ఆలపించిన తర్వాత.. చివర్లో తమిళ గీతాన్ని పాడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలోనే తమిళ గీతాన్ని పాడటం ఆనవాయితీ అని, గవర్నర్ తమిళ ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాడులో రాష్ట్రపతి పాలన కోసం పిల్
తమిళనాడు అసెంబ్లీలో మే,13న జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విశ్వాస పరీక్షపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఇందులో ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని మధురైకి చెందిన కేకే రమేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ లేని టీవీకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి మద్దతు కూడగట్టి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ అక్రమాలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని రమేశ్అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు.
ప్రమాణ స్వీకారంలో రాజీవ్, రాహుల్ ప్రస్తావన.. గవర్నర్ సీరియస్
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కాగితంపై ఉన్న ప్రమాణాన్ని చదువుతూ.. కాంగ్రెస్ నాయకులైన కామరాజ్ (తమిళనాడుకు చెందిన దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత) వర్ధిల్లాలి, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, ప్రజానాయకుడు రాహుల్ గాంధీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ ఆర్లేకర్ ఒకింత సీరియస్అయ్యారు. ‘అది మీ ప్రమాణంలో భాగం కాదు’ అని పేర్కొన్నారు. కేవలం ప్రమాణ పత్రాన్ని మాత్రమే చదవాలని సూచించారు.
