మార్స్​పై రోవర్​ను ఇంట్లో నుంచే కంట్రోల్​ చేస్తుండు

మార్స్​పై రోవర్​ను ఇంట్లో నుంచే కంట్రోల్​ చేస్తుండు

భూమి నుంచి 24 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్‌‌పై నాసా ఇటీవలే మరో రోవర్‌‌‌‌ను దించింది. వందల కోట్ల ఏండ్ల క్రితం అక్కడ జీవం ఉండేదా అన్న దానిపై పరిశోధనలు చేసేందుకు పర్సివరెన్స్ పేరుతో రోవర్‌‌‌‌ను పంపింది. అక్కడి నేలను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి పంపడంతో పాటు మట్టి, రాళ్లను సేకరించి భూమికి పంపడం ఈ రోవర్ పని. ఈ రోవర్ ఎక్కడెక్కడ తిరగాలి? ఏ ప్రాంతంలో మట్టి, రాళ్లను తీసి మనకు చేర్చాలన్నది డైరెక్ట్ చేయడంలో ఇండియన్ సైంటిస్ట్‌‌ది కీ రోల్. అయితే ఆయన రోవర్ కంట్రోలింగ్ వర్క్‌‌ను ఇంట్లో కూర్చునే చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు మనుషులకు ఉన్న ఏకైక ప్లేస్ భూమి. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైనా మనం ఇండ్లు కట్టుకుని బతకగలిగే అవకాశాలపై ఎన్నో ఏండ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. ఉన్నవాటిలో చంద్రుడు, మార్స్ (అంగారక గ్రహం) బెటర్ అన్న ఆలోచనతో వాటిపై ఇండియా, అమెరికా సహా అనేక దేశాలు రీసెర్చ్ చేస్తున్నాయి. మనం ఇప్పటికే మార్స్‌‌పైకి మంగళయాన్, చంద్రుడిపైకి చంద్రయాన్‌‌లను సక్సెస్​ఫుల్‌‌గా ప్రయోగించాం. ఈ ప్రయోగాల్లో ఒకడుగు ముందున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మార్స్‌‌పైకి గతంలో నాలుగు రోవర్లను పంపింది. లేటెస్ట్‌‌గా ఫిబ్రవరి 19న ‘పర్సివరెన్స్’ అనే పేరుతో ఐదో రోవర్‌‌‌‌ను అంగారక గ్రహంపై దించింది. అయితే అక్కడ చేయాల్సిన పనికి సంబంధించి రోవర్‌‌‌‌ను గైడ్, కంట్రోల్ చేయడంలో ఇండియన్ సైంటిస్టు, జియాలజీ ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా ప్రధాన పాత్రపోషిస్తున్నారు.

అసలైన పని శాంపిల్ కలెక్షనే!

పర్సివరెన్స్ రోవర్‌‌‌‌ను పంపిన ప్రధాన ఉద్దేశం మార్స్‌‌పై జీవం ఆనవాళ్లకు సంబంధించిన ఆధారాలను తేల్చడమే. అంగారక గ్రహంపైనున్న జెజెరో క్రెటర్ ఏరియాలో  దాదాపు 350 కోట్ల ఏండ్ల క్రితం ఒక నది ఉండేదని గతంలో వచ్చిన శాటిలైట్ ఇమేజెస్‌‌ను బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి సైంటిఫిక్ ఆధారాల కోసం నాసా శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసమే పర్సివరెన్స్ రోవర్‌‌‌‌ను లాంచ్ చేశారు. దాదాపు ఏడు నెలల క్రితం భూమి నుంచి ప్రయాణమైన పర్సివరెన్స్ ఫిబ్రవరి 19 తెల్లవారుజామున రెండున్నర టైమ్‌‌లో సేఫ్‌‌గా మార్స్‌‌పై ల్యాండ్ అయింది. అంగారక గ్రహంపై దిగిన కొద్ది గంటల్లోనే దాని నేల ఫొటోలను తీసి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న నాసా మిషన్ కంట్రోల్ స్టేషన్‌‌కు పంపడం మొదలుపెట్టింది. అయితే దాని మేజర్ వర్క్ వేరే ఉంది. మార్స్ పైనుంచి మట్టి, రాళ్లను వేర్వేరు ప్రాంతాల్లో తీసుకుని, ఆ శాంపిల్స్‌‌ను భూమికి చేర్చడమే పర్సివరెన్స్ అసలైన టాస్క్.

ఎక్కడ తీసుకోవాలో గైడ్ చేసేది ఇండియనే

మార్స్‌‌పై ఏ ప్రాంతాల్లో వందల కోట్ల ఏండ్ల క్రితం నది ఉండేది? దాని ఆనవాళ్లను సైంటిఫిక్‌‌గా రుజువు చేయాలంటే మట్టి, రాళ్లను ఎక్కడి నుంచి తీసుకోవాలి?  అనే విషయాలను రోవర్‌‌‌‌కు గైడ్‌‌ చేయడం చాలా కీలకం. ఈ పని చేయాలంటే నిపుణుడైన జియాలజిస్ట్ అవసరం. శాటిలైట్ ఇమేజెస్, ప్రస్తుతం మార్స్‌‌పై నుంచి రోవర్ తీసి పంపే ఫొటోలను కలిసి అనలైజ్ చేసి, మట్టి, రాళ్లు ఎక్కడెక్కడ శాంపిల్ తీసుకోవాలన్నది మ్యాపింగ్ చేయాలి. ఇందుకోసం ఎప్పటి నుంచో నాసాతో కలిసి పని చేస్తున్న ఇండియన్ ఆరిజన్ సైంటిస్ట్, జియాలజీ ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా ఈ పర్సివరెన్స్ రోవర్‌‌‌‌ను కంట్రోల్ చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసే పని పూర్తి చేస్తారు.

రోవర్‌‌‌‌ను ఫీట్ చేయించాలని రిక్వెస్ట్

వాస్తవానికి సంజీవ్ గుప్తా ఈ రోవర్ ల్యాండింగ్ కంటే ముందు నుంచే నాసా శాస్త్రవేత్తలతో కలిసి కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో పని చేయాల్సి ఉంది. లండన్‌‌లోని ఇంపీరియల్ కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్‌‌‌‌గా కూడా పని చేస్తున్న ఆయన యూకేలో కరోనా తీవ్రత తగ్గకపోవడంతో అమెరికా వెళ్లలేకపోయారు. లండన్‌‌లో ఇంకా లాక్‌‌డౌన్ కొనసాగుతుండడం వల్ల వర్క్‌‌ ఫ్రం హోం చేస్తున్నారు. పర్సివరెన్స్ రోవర్ ల్యాండింగ్ జరిగే టైమ్‌‌లో కూడా ల్యాబొరేటరీలోని సైంటిస్టులతో జూమ్‌‌ కాల్‌‌లో కనెక్ట్ అయ్యి, ఎదుట మరో మూడు ల్యాప్‌‌టాప్స్ పెట్టుకుని రాత్రంతా వర్క్ చేశానని సంజీవ్ చెప్పారు. ప్రతి రోజూ నాసా టీమ్‌‌తో మీటింగ్స్ జరుగుతున్నాయన్నారు. కరోనా వల్ల మరో 400 మంది సైంటిస్టులు వేర్వేరు దేశాల నుంచి తనలాగే ఈ మార్క్ మిషన్ కోసం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని చెప్పారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా వర్క్ చేస్తున్నందు వల్ల భార్యపిల్లలకు నిద్ర డిస్టర్బ్ కాకూడదని ఒక సెలూన్‌‌పైన ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కిరాయి తీసుకుని ఉంటున్నానని అన్నారు. తాను రోవర్‌‌‌‌ను కంట్రోలింగ్ వర్క్ చేస్తున్నానని తెలిసి, టీనేజ్ కుర్రాడైన తన ఫ్రెండ్ కొడుకు ఫోన్ చేసి, రోవర్‌‌‌‌తో (బైక్‌‌ను సింగిల్ వీల్‌‌పై లేపినట్టుగా) ఫీట్​చేయించాలని అడుగుతున్నాడని బ్రిటన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

2027 నాటికి శాంపిల్స్ వస్తయ్

మార్స్‌‌పై జెజెరో క్రేటర్‌‌‌‌ ఏరియాలో కొన్ని వందల కోట్ల ఏండ్ల క్రితం నదీ ప్రవాహం, లోయలు, పరివాహక ప్రాంతం అంచనా వేస్తున్నామని, దీనికి శాస్త్రీయ ఆధారాలను కనిపెట్టేందుకు అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకురావాలని సంజీవ్ గుప్తా తెలిపారు. మార్స్ ఆర్బిట్‌‌లో తిరుగుతున్న  శాటిలైట్స్ తీసి పంపుతున్న ఇమేజెస్‌‌తో పాటు పర్సివరెన్స్ రోవర్‌‌‌‌లో ఉన్న రాడార్, సోనార్‌‌‌‌ సెన్సర్ల సాయంతో ఆ నది ఎక్కడ ఉండేది, ఎక్కడ మట్టి సేకరించాలన్నదానిపై మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. ఈ మ్యాపింగ్ చేసిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో రోవర్ తవ్వి, మట్టి రాళ్లను సేకరించి పెడుతుందని తెలిపారు. రోజూ నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని టీమ్‌‌తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ తర్వాత యూకే బేస్డ్ మిషన్‌‌ ద్వారా 2027 నాటి ఆ శాంపిల్స్‌‌ను భూమికి తీసుకువచ్చి, వాటిపై ప్రయోగాలు చేస్తామని సంజీవ్ గుప్తా చెప్పారు.  మన భూమితో పోలిస్తే మార్స్‌‌పై ఒక రోజు పూర్తవడానికి 40 నిమిషాలు ఎక్కువ టైమ్ పడుతుందని, ఈ మిషన్‌‌లో వర్క్ చేసే సైంటిస్టులందరికీ ఇదొక డైలీ జెట్‌‌ ల్యాగ్ లాంటిదేనని అన్నారు. అలాగే భూమి నుంచి తాము పంపిన సిగ్నల్స్ రోవర్‌‌‌‌కు చేరడానికి 11 నిమిషాల వరకు పడుతోందని చెప్పారు.

మార్స్ మిషన్‌‌లో మరో ఇండియన్ కీ రోల్

 ఈ మార్స్ మిషన్‌‌లో మరో ఇండియన్ సైంటిస్ట్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పర్సివరెన్స్ రోవర్ డెవలప్‌‌మెంట్‌‌ నుంచి ఆమె ఇన్వాల్వ్‌‌మెంట్ ఉంది. ప్రస్తుతం రోవర్ లాంచింగ్ జరిగినప్పటి నుంచి మిషన్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ లీడ్ ఇంజనీర్‌‌‌‌గా స్వాతి మోహన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోవర్  ల్యాండింగ్, ఇప్పుడు దాని డేటా ట్రాన్స్‌‌ఫర్ విషయంలోనూ ఈ కమ్యూనికేషన్ టీమ్‌‌ది ప్రధాన పాత్ర. సిగ్నల్స్ విషయంలో ఏ మాత్రం ఇబ్బంది రాకుండా రోవర్ మార్స్‌‌పై సేఫ్‌‌గా ల్యాండ్ కావడంతో సైంటిస్టులంతా ప్రశాంతంగా ఊపిరిపీల్చుకున్నారు. స్వాతి మోహన్ గతంలో నాసా శాటర్న్, మూన్ మిషన్లలోనూ పని చేశారు.