బంగ్లా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌కు దడపుట్టించిన చహర్‌‌‌‌

బంగ్లా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌కు దడపుట్టించిన చహర్‌‌‌‌

పదహారేళ్ల వయసులో  క్రికెట్‌‌కు పనికిరావన్నారు..!  గ్రెగ్‌‌ చాపెల్‌‌ స్థాయి వ్యక్తి.. నీ బౌలింగ్‌‌లో పసలేదు..నీకు ఫ్యూచరే లేదన్నాడు..!  కానీ, రెండేళ్లకే రంజీల్లోకి వచ్చేశాడు..! అంతేనా ఫస్ట్​ మ్యాచ్‌‌లోనే ఎనిమిది వికెట్లు తీసి ఔరా అనిపించాడు..!  ఇక తిరుగేలేదు అనుకుంటే.. కెరీర్‌‌ రివర్సైంది..!  గాయాలు వెంటాడాయి..! అవకాశాలు చేజారాయి..!  కెరీర్‌‌ అయోమయంలో పడింది..! ఐపీఎల్‌‌ రూపంలో చాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేపోయాడు..!  అయినా అతను కుంగిపోలేదు..!  విఫలమైనప్పుడల్లా… వెనక్కులాగిన విల్లులా ముందుకొచ్చాడు..!  నాన్న వెన్నుతట్టి ప్రోత్సాహించగా.. కోచ్‌‌గా మారి ఆటతో పాటు జీవిత పాఠాలూ నేర్పించగా.. టీమిండియాలోకి దూసుకొచ్చాడు..!  నెట్స్‌‌లో లక్షల బంతులు విసిరిన అతనిప్పుడు తండ్రి నిర్దేశించిన లక్ష్యానికి చేరువయ్యాడు..! అతను మరెవరో కాదు ఇండియా యువ పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌..! బంగ్లాదేశ్‌‌పై హ్యాట్రిక్‌‌ సహా ఆరు వికెట్లతో టీ20ల్లో వరల్డ్‌‌ రికార్డు సృష్టించిన దీపక్‌‌ ఎదిగిన తీరు ఎంతో మందికి స్పూర్తిదాయకం..!

వెలుగు, క్రీడావిభాగం: దీపక్ చహర్‌‌‌‌…‌‌‌‌ ఇప్పుడు క్రికెట్‌‌‌‌ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు.  చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌తో క్రికెట్‌‌‌‌ ప్రపంచానికి పరిచయమై.. ధోనీ సారథ్యంలో రాటుదేలి..  సీనియర్ల గైర్హాజరీతో వచ్చిన అవకాశంతో అద్భుతం సృష్టించిన ఈ యంగ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు.   ఇలాంటి అద్భుతాలు  చేయడం దీపక్‌‌‌‌కు కొత్తకాదు. 18 ఏళ్ల వయసులోనే  రాజస్థాన్‌‌‌‌ తరఫున తన అరంగేట్ర రంజీ మ్యాచ్‌‌‌‌లో 10 పరుగులకు 8 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. హైదరాబాద్‌‌‌‌ను 21 పరుగులకే ఆలౌట్‌‌‌‌ (రంజీల్లో లోయెస్ట్‌‌‌‌ స్కోరు) చేసి డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో సంచలనం సృష్టించాడు. 2010లో జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌‌‌‌లో ట్రెండ్‌‌‌‌ సృష్టించింది. తాజాగా నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో బంగ్లాపై ఆరు వికెట్లతో బంగ్లా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌కు దడపుట్టించిన చహర్‌‌‌‌ పెర్ఫామెన్స్ ఇప్పట్లో మర్చిపోయేది కాదు.

16 ఏళ్లకే రిజెక్షన్‌‌‌‌..

స్టయిలిష్‌‌‌‌ లుక్స్‌‌‌‌తో బాలీవుడ్‌‌‌‌ హీరోను తలపించే దీపక్‌‌‌‌ జర్నీ అంత సాఫీగా సాగలేదు.  టీనేజ్‌‌‌‌లోనే అతను రిజెక్షన్‌‌‌‌కు గురయ్యాడు. ఏజ్‌‌‌‌ లెవెల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో బాగా ఆడుతూ..16 ఏళ్ల వయసులో (2008) రాజస్థాన్‌‌‌‌  క్రికెట్‌‌‌‌ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ఆ సమయంలో అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న  గ్రెగ్‌‌‌‌ చాపెల్‌‌‌‌…  తన బౌలింగ్‌‌‌‌ సామర్థ్యాన్ని శంకిస్తూ  రిజెక్ట్‌‌‌‌ చేయడంతో దీపక్‌‌‌‌ గుండెబద్దలైంది. కోచింగ్‌‌‌‌లో ఎంతో ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ ఉన్న చాపెల్‌‌‌‌ రిజెక్ట్‌‌‌‌ చేయడంతో చహర్‌‌‌‌లో నిజంగానే పస లేదని చాలా మంది అనుకున్నారు. కానీ, ఈ రిజెక్షన్‌‌‌‌ దీపక్‌‌‌‌లో కసిని పెంచింది. తన ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. అందుకోసం డే నైట్‌‌‌‌ కష్టపడ్డాడు. రెండేళ్లలోనే రాజస్థాన్‌‌‌‌ రంజీ టీమ్‌‌‌‌లో చోటు దక్కించకున్నాడు. హైదరాబాద్‌‌‌‌ జట్టుపై అరంగేట్రంతోనే అద్భుత పెర్ఫామెన్స్‌‌‌‌తో డొమెస్టిక్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌లో ప్రకంపనలు సృష్టించాడు.  ఆ సీజన్‌‌‌‌లో 40 ప్లస్‌‌‌‌ వికెట్లు తీయడంతో దీపక్‌‌‌‌ను అంతా ఫ్యూచర్‌‌‌‌ ఇండియా స్టార్‌‌‌‌గా భావించారు. కానీ, కీలక సమయంలో గాయాలు కావడం  చహర్ కెరీర్‌‌‌‌ను దెబ్బతీసింది.

రోహిత్‌‌‌‌ మరో మెట్టెక్కించాడు..

కొత్త బంతితో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ బంతులు వేయగల చహర్‌‌‌‌‌‌‌‌.. పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో బ్యాట్స్‌‌‌‌మెన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో దిట్ట. అందుకే ఐపీఎల్‌‌‌‌లో ధోనీ ఆరంభంలోనే వరుసగా మూడు ఓవర్లు వేయించేవాడు. కానీ ఆదివారం బంగ్లాతో మ్యాచ్‌‌‌‌లో మాత్రం కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ అతన్ని  మరోలా వాడుకున్నాడు. పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో ఒకే ఓవర్‌‌‌‌‌‌‌‌ వేయించి..కీలక  డెత్‌‌‌‌ ఓవర్లలో బౌలింగ్‌‌‌‌ చేయించి ఫలితాన్ని రాబట్టాడు. ఈ వ్యూహం ఇండియాకు సిరీస్‌‌‌‌ విజయంతో పాటు.. హ్యాట్రిక్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ రికార్డును నెలకొల్పేలా చేసింది. ఈ ఫెర్ఫామెన్స్​తో కొత్త బంతితోనే కాకుండా డెత్‌‌‌‌ ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేసే దమ్మున్న బౌలర్‌‌‌‌గా చహర్‌‌‌‌ నిరూపించుకున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తే టీమిండియాలో ప్లేస్‌‌‌‌ను సుస్థిరం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో ఆడాలన్న తండ్రి కలను కూడా తొందర్లోనే సాకారం చేస్తాడనడంలో సందేహం లేదు.

ధోనీ చెక్కిన శిల్పం..

డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో రాణించిన దీపక్‌‌‌‌ ..ఐపీఎల్‌‌‌‌లో తొలుత రాజస్థాన్‌‌‌‌కు ఎంపికైనా  ఆడే అవకాశం దక్కలేదు. 2016, 2017 సీజన్లలో  పుణె సూపర్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌కు ఆడినా  మెప్పించలేకపోయాడు. 2018 ఐపీఎల్‌‌‌‌కు ముందు ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టి చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌ కింగ్స్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. పుణె తరఫున ఆడిన సమయంలోనే దీపక్‌‌‌‌లోని స్పార్క్‌‌‌‌ను చూసిన చెన్నై కెప్టెన్‌‌‌‌ ధోనీ.. అతని బౌలింగ్‌‌‌‌ను మరింత మెరుగుదిద్దాడు. కొత్తబంతితో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసే దీపక్‌‌‌‌తో పవ ర్‌‌‌‌‌‌‌‌ప్లేలో బౌలింగ్‌‌‌‌ చేయిస్తూ స్పెషలిస్ట్‌‌‌‌గా నిలబెట్టాడు. పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్‌‌‌‌ చేయాలో.. వైడ్‌‌‌‌ యార్కర్లు, స్లోయర్లు వేయడం అక్కడే దీపక్‌‌‌‌ నేర్చుకున్నాడు. 2018లో 10 వికెట్లతో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీపక్‌‌‌‌.. 2019 లో 22 వికెట్లు పడగొట్టి  వన్డే వరల్డ్‌‌‌‌కప్ స్టాండ్‌‌‌‌బైగా ఎంపికయ్యాడు.

తండ్రే గురువై..

చాపెల్‌‌ రిజెక్ట్‌‌ చేసినప్పుడు.. రంజీ తొలి సీజన్‌‌ తర్వాత గాయాలతో ఆట దెబ్బతిన్నప్పుడు దీపక్‌‌ కుంగిపోలేదు. అందుకు కారణం అతని తండ్రి లోకేంద్ర సింగ్‌‌ చహర్‌‌. ఈ రెండు సందర్భాల్లోనే కాదు దీపక్ విఫలమైనప్పుడల్లా లోకేంద్ర అండగా నిలిచాడు. ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ ఉద్యోగి అయిన లోకేంద్ర కూడా క్రికెటర్‌‌ కావాలనుకున్నా.. అతని తండ్రి ఒప్పుకోలేదు. అయితే, తన కొడుకు ఆశయం కూడా అదే కావడంతో లోకేంద్ర .. దీపక్‌‌ను ప్రోత్సహించి అతని కలతో పాటు తన ఆశయాన్ని  నేరవేర్చుకోవాలనుకున్నాడు. ఆ దిశగా చిన్నప్పటి నుంచే దీపక్‌‌ను తీర్చిదిద్దాడు. అతని కోసం ఉద్యోగాన్ని కూడా వదిలి రాజస్థాన్ నుంచి సొంతూరు ఆగ్రాకు వచ్చి.. తనకు తెలిసిన క్రికెట్‌‌ పాఠాలను నేర్పాడు. క్రికెట్‌‌ కోచింగ్‌‌ గురించి పెద్దగా తెలియకపోయినా.. తన ఆల్‌‌టైమ్‌‌ ఫేవరెట్స్‌‌ మాల్కమ్‌‌ మార్షల్‌‌, డేల్‌‌ స్టెయిన్‌‌ బౌలింగ్‌‌ వీడియోలను చూస్తూ..  దీపక్‌‌కు నేర్పించేవాడు. అంతేకాకుండా అతని శిక్షణ కోసం సొంత డబ్బులతో టర్ఫ్, కాంక్రీట్‌‌లతో కూడిన పిచ్‌‌లను ఏర్పాటు చేశాడు. ప్రాక్టీస్‌‌ వల్ల దీపక్‌‌ సరిగ్గా స్కూల్‌‌కు కూడా వెళ్లలేదు. ట్రైనింగ్‌‌, జిమ్‌‌, రెస్ట్‌‌, రికవరీ. ఇదే దీపక్‌‌ దినచర్య. అతని డిగ్రీ వరకు ఇదే కొసాగింది. తండ్రి మార్గనిర్దేశంలో నెట్స్‌‌లో కొన్ని లక్షల బంతులు బౌలింగ్‌‌ చేసి.. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచున్న దీపక్‌‌ డొమెస్టిక్‌‌, ఐపీఎల్​లో సత్తా చాటాడు.

Credit to my father, he has given his life in shaping my career: Deepak Chahar