Cyber crimes: ఇన్వెస్ట్​మెంట్ పేరుతో 10 కోట్ల ఫ్రాడ్

Cyber crimes: ఇన్వెస్ట్​మెంట్ పేరుతో 10 కోట్ల ఫ్రాడ్
  • అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపి ఏపీ, తెలంగాణలో 500 మందికి టోకరా
  • క్సీటో కన్సల్టెన్సీ సంస్థపై సైబరాబాద్ పోలీసుల దాడులు.. ముగ్గురు అరెస్ట్

ఖైరతాబాద్, వెలుగు: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే నాలుగు రెట్లు లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డ క్సీటో కన్సల్టెన్సీ సంస్థపై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ సతీశ్,  వెంకట చలపతి(48) అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరు కేంద్రంగా 2015లో క్సీటో కన్సల్టెన్సీ ప్రైవేటు లిమిటెడ్​ను ప్రారంభించారు. కొంతకాలం తర్వాత కడపకు చెందిన గడిరాజు రాజేంద్ర ప్రసాద్(29), పాశం వెంకట ప్రసాద్(28), జ్యోతి, గురు ప్రసాద్​తో కలిసి కేపీహెచ్​బీకాలనీలోని మంజీరా ట్రినిటీ మాల్ 11వ అంతస్తులో ఈ కంపెనీ బ్రాంచ్​ను ప్రారంభించారు.  ‘ఎక్స్’ కాయిన్ డిజిటల్ కరెన్సీ(క్సీటో కరెన్సీ)లో ఇన్వెస్ట్ చేస్తే నాలుగు రెట్లు లాభాలు పొందవచ్చని  నమ్మించి ఎంతో మంది నుంచి డబ్బు సేకరించారు. సిటీకి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి తనకు తెలిసిన వారితో కలిసి రూ.6.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు.  9000250002@okbizaxis యూపీఐ ఐడీ ద్వారా క్సీటో కంపెనీకి తన పెట్టుబడులను ట్రాన్సఫర్​ చేశాడు. రాబడి లేదంటూ క్సీటో మేనేజ్​మెంట్​ను ఎన్నిసార్లు అడిగినా రెస్పాన్స్ లేకపోవడంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.  సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం క్సీటో కంపెనీ ఆఫీసుపై దాడులు చేశారు. రాజేంద్ర ప్రసాద్, వెంకట ప్రసాద్, వెంకట చలపతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు, క్సీటో డైరెక్టర్ బీఎన్ సతీశ్​తో పాటు మరో ఇద్దరు పరారలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్సీటో 
నిర్వాహకులు ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 500 మందితో దాదాపు 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బ్యాంక్ లోన్లు ఇప్పిస్తమంటూ..

ఖైరతాబాద్:   వరంగల్​కు చెందిన మీర్జా కదీర్ బేగ్ బంజారాహిల్స్ రోడ్ నం.3లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతులను ఎంప్లాయీస్​గా రిక్రూట్ చేసుకున్నాడు. లోన్లు ఇప్పిస్తామంటూ వారితో ఫోన్లు చేయించి అమాయకుల నుంచి చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవాడు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హనుమకొండలో మీర్జా కదీర్​ను అరెస్ట్ చేశారు.

కోటీశ్వరుల్ని చేస్తమని..

ట్రేడింగ్, ఇన్వెస్ట్​మెంట్​తో కోటీశ్వరుల్ని చేస్తామని నమ్మించి సైబర్ దొంగలు సిటీకి చెందిన ఇద్దరు మహిళల నుంచి రూ.22 లక్షలు కాజేశారు.  బాధితులు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.