- సిసలైన కాంగ్రెస్ నేతలకు పీసీసీ పదవులు దక్కడంలేదు
- మూడు నెలల కింద పార్టీలోకి వచ్చినోళ్లకు పదవులా?
- హైకమాండ్ ఏం చేస్తున్నదో అంతుపట్టడం లేదు
- రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళన చేయకపోతే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు గత ఎనిమిదేండ్లుగా కోవర్టుల రోగం పట్టుకుందని, సమయం వచ్చినప్పుడు వాళ్ల పేర్లు బయటపెడ్తానని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో ఉంటూ సర్కారు కోసం పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాలుగైదేండ్లుగా తాను ఈ విషయాన్ని చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీలో ఇంత నిర్లక్ష్యం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. హైకమాండ్ తొందరగా దీనిపై దృష్టి సారించి, ప్రక్షాళనకు పూనుకోవాలని, లేకపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా నేతలతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. పీసీసీ కమిటీ కూర్పుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న వాళ్లు, కష్టపడి పని చేస్తున్న వాళ్లకు పదవులు దక్కడం లేదన్నారు. పార్టీలోకి మూడు నాలుగునెలల కింద వచ్చినవాళ్లకు మాత్రం పదవులు దక్కుతున్నాయని, అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. తమ కుటుంబం 58 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉందనీ, అలాంటి తనకే ఆశ్చర్యం కలిగించే తీరులో పార్టీ వ్యవహారాలు సాగుతున్నాయని అన్నారు. ఈ పరిణామాలపై హైకమాండ్ ఏం చేస్తున్నదో అంతుపట్టకుండా ఉందని, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతం, పని తీరు తెలియని వాళ్లకు పదవులిచ్చారని ఆయన విమర్శించారు. ఏండ్లుగా కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే పార్టీకి ప్రమాదకరమని హెచ్చరించారు.
గాంధీభవన్‌లో ఓయూ నేతల భేటీ
పీసీసీ పదవుల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఓయూ నేతలు మంగళవారం గాంధీభవన్‌కు వచ్చారు. సోమవారం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన వీళ్లు తర్వాత పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో సమావేశమయ్యారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్న విద్యార్థి లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను మల్లు రవి బుజ్జగించే ప్రయత్నం చేశారు. శని, ఆదివారాల్లో పీసీసీ చీఫ్‌తో ఓయూ విద్యార్థి నేతల సమావేశం ఏర్పాటు చేస్తానని, సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు.
ఆదిలాబాద్ నేతల రాజీనామా
కాంగ్రెస్‌లో లంబాడాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న ఆ వర్గానికి అన్యాయం చేశారని పీసీసీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.కనీసం హిందీ భాషను సరిగ్గా మాట్లాడలేని రేవంత్‌రెడ్డి ఏ ప్రాతిపదికన కార్యవర్గాన్ని నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చారులత రాథోడ్ కూడా పార్టీ పదవికి రాజీనామా చేశారు.
పార్టీలో మెదక్ జిల్లాకు ప్రాధాన్యమేది?
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సంగారెడ్డిలో సాగినప్పుడు మెదక్ జిల్లా నేతలు ఎంతో కష్టపడి సక్సెస్ చేశారని దామోదర రాజనర్సింహ అన్నారు. కానీ పదవుల విషయంలోకి వచ్చే సరికి జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కోవర్టులకు మాత్రమే గుర్తింపు ఉందని, కోవర్టిజం నడుస్తున్నదని మండిపడ్డారు. ‘‘సిద్దిపేట జిల్లాలో కోవర్టిజం జరుగుతున్నదని నేను చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నా. అయినా పట్టించుకోవడం లేదు. ఇంత నిర్లక్ష్యం చేస్తే పార్టీ భవిష్యత్తు ఏం కావాలి? కోవర్టులను అగ్ర నేతలే కాపాడుతున్నారు. పరిస్థితులు మారుతాయని ఆశిస్తూ వచ్చినా నిరాశే ఎదురవుతున్నది. మేము అసలు సిసలైన కాంగ్రెస్ వాదులం.. మాకు పదవుల కన్నా ఆత్మగౌరవం ముఖ్యం. పార్టీ పదవులు కేటాయించే ముందు జిల్లా వారి సమీక్షలు జరుగుతాయి.. కానీ అవేమీ లేకుండానే పదవులు పంచేశారు. జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ల లిస్టు చూస్తే అసలు ఆ పదవులకు విలువ ఉన్నదా అన్న తీరులో పరిస్థితిని తయారుచేశారు” అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరగాన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగలు, ముదిరాజ్‌లు ఉన్నారని, ఈ రెండు వర్గాలకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం లేదని, కార్యకర్తల సమస్యలను మాత్రం దృష్టికి తెస్తున్నానని ఆయన చెప్పారు.

