కరోనా మరణాల అసలు లెక్క చెప్పాలె

కరోనా మరణాల అసలు లెక్క చెప్పాలె
  • 1.2 లక్షల మంది చనిపోతే.. 3,912 మందే అంటున్నరు
  • మిగతా బాధిత కుటుంబాలను ఆదుకునేదెవరు?
  • రాష్ట్ర సర్కారు తీరుతో 50 వేల కేంద్ర సాయానికి దూరమైతున్రు
  • కరోనా డెత్ ఆడిట్ చేపట్టాలె.. సీఎంకు దాసోజు శ్రవణ్ లెటర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనాతో 1.2 లక్షల మంది చనిపోతే.. 3,912 మంది మాత్రమే చనిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ఈ దొంగ లెక్కల వల్ల.. కేంద్రం ప్రకటించిన రూ.50 వేల నష్ట పరిహారాన్ని బాధిత కుటుంబాలు అందుకోలేకపోతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆదివారం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దాసోజు బహిరంగ లేఖ రాశారు. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క రాష్ర్టంలో వేల మంది చనిపోయారని, ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు లెక్కలు చెప్పిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇగో పక్కనబెట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే కరోనా మరణాల అసలు లెక్క బయటకు రావాలని, ఇందుకు డెత్ ఆడిట్ నిర్వహించాలన్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకోవాలని కోరారు.

మరణాలపైనా అబద్ధాలేనా?

‘‘కరోనా మరణాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఐసీఎంఆర్ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఉల్లంఘించింది. ‘రైట్ టు డై’ని కూడా కేసీఆర్ సర్కార్ అతిక్రమించింది. మరణాలపైనా అబద్ధాలెందుకు?” అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ‘‘కరోనా మరణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా చూపిందనేందుకు ఆధారాలు ఉన్నాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో 2017లో 50,714 మంది చనిపోయారు. 2018లో 53,033 మంది, 2019లో 64,166 మంది, 2020లో 76,375 మంది, 2021 జూన్ 30 నాటికి 47,472 మంది మృతిచెందినట్లు జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. 2017, 2018, 2019లో సగటున ఏడాదికి 55,791 మరణాలు నమోదయ్యాయి. కానీ తర్వాతి రెండేళ్లలో డెత్స్ భారీగా పెరగడానికి కరోనా కారణం కాదా?” అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డెత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటాను పరిశీలిస్తే.. లక్షా 20 వేల మందికి పైగా చనిపోయారని తేలుతోందని చెప్పారు. 

బాధితులకు తీరని అన్యాయం

ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరత వల్ల ప్రాణాలను కాపాడుకోలేకపోయామని, ఇప్పుడు మరణాలను దాచడం వల్ల బాధిత కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని దాసోజు చెప్పారు. ‘‘రాజకీయ నేతలు తమ స్వలాభం కోసం అబద్ధాలాడుతుంటారు. కానీ అధికారులూ బాధ్యత లేకుండా అబద్ధాలు చెప్పడం దుర్మార్గం. ప్రభుత్వం, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల కరోనా బాధిత కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది” అని అన్నారు.