సంతానోత్పత్తి రేటు తగ్గుడు మంచిదే

సంతానోత్పత్తి రేటు తగ్గుడు మంచిదే

తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం సంతానోత్పత్తి రేటు తగ్గింది.  ఇది ఆందోళన చెందాల్సిన అంశమా? సానుకూల పరిణామమా? అనే విషయంలో భిన్నవాదనలు ఉండొచ్చు. కానీ జనాభా వృద్ధిని స్థిరీకరించడంలో మాత్రం ఇది ఆహ్వానించదగిన మార్పే. 2045 నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో 2000 సంవత్సరంలో రూపొందించిన జాతీయ జనాభా విధాన లక్ష్యాల సాధనలో ఒక ముందడుగు పడినట్లుగానే భావించాలి. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వాలు బాలికా విద్యపై ఫోకస్​ పెట్టడంతోపాటు కుటుంబ నియంత్రణ, ఆరోగ్యంపై మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదిక ప్రకారం దేశ జనాభా వృద్ధినిదానిస్తోంది. గతంలో మహిళల సంతానోత్పత్తిరేటు(టీఎఫ్‌ఆర్‌– సగటున ప్రతి మహిళా తన జీవితకాలంలో జన్మనిచ్చే శిశువుల సంఖ్య) జాతీయ స్థాయిలో 2.2 కాగా, ఇప్పుడది 2కు తగ్గింది. పట్టణ జనాభాలో1.6 ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 2.1గా నమోదైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చిన సంతానోత్పత్తి రేటు తగ్గుదల వ్యక్తుల శరీర, ఆరోగ్యపరమైన అంశం కాదు. ప్రతి మహిళ సగటును పొందుతున్న సంతానోత్పత్తి తాలూకు వార్షిక గణన. ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలు, మెరుగైన గర్భనిరోధక కార్యక్రమాలు లాంటివి సంతానోత్పత్తిలో క్షీణతకు కారణమై ఉండొచ్చు. అయితే ఇది ఆందోళన చెందాల్సిన అంశమా? సానుకూల పరిణామమా? అనే విషయంలో భిన్న వాదనలు ఉండొచ్చు. కానీ జనాభాను స్థిరీకరించడంలో మాత్రం ఇది ఆహ్వానించదగిన మార్పే. ఏటా దాదాపు 2.5 కోట్ల మంది పిల్లలు పుడుతుంటే.. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వమూ అంత వేగంగా స్కూళ్లు, ఇతర సౌకర్యాలను కల్పించే సామర్థ్యం ఉండదనేది ఆరోగ్య నిపుణుల మాట. ఇన్నేండ్లు ఆరోగ్య శాఖలు జనాభా స్థిరీకరణ కోసమే వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ 
వస్తున్నాయి. 
 

చైనాను దాటుతమా?
అయితే తాజా నివేదిక ప్రకారం సంతాన సాఫల్య రేటు తగ్గుదలతో భారత్​ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించే ప్రమాదం తప్పినట్టేనా? అంటే చెప్పలేం. ఎందుకంటే చైనా తన దేశ జనాభాను నియంత్రించేందుకు ఏం చేస్తోందన్నదానితో సహా దాన్ని అంచనా వేయడానికి చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో జనాభా తగ్గుతున్న ట్రెండే కనిపిస్తోంది. భారత్​ మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారే దారిలోనే ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే జనాభా వృద్ధిని స్థిరీకరించడంలో భారత్​ కీలకమైన దశ సాధించినట్లుగా చెప్పవచ్చు. ఇండియా ఒక తరాన్ని భర్తీ చేసే స్థాయిలో సంతానోత్పత్తి రేటు తగ్గుదల నమోదు చేయడం విశేషం. 
 

వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా..
తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంతానోత్పత్తి, శిశు మరణాలు, పునరుత్పత్తి ఆరోగ్యం, పోషకాహారం, రక్తహీనత, కుటుంబ నియంత్రణ సేవల నాణ్యత తదితర అంశాలను క్రోడీకరించింది. 1992-–93లో ఈ సర్వే ప్రారంభమవగా.. తాజాగా విడుదలైంది(2019–-21) అయిదో సిరీస్. ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్)కి కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ సర్వే నోడల్ బాధ్యతను అప్పగించింది. ఈ సర్వే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో (2017 మార్చి నాటికి) 6.37 లక్షల ఇళ్ళను శాంపుల్‌గా తీసుకుంది. తాజా సర్వే ప్రకారం సంతానోత్పత్తి రేటు దేశం మొత్త ఒకేలా ఉందా అంటే లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంది. ఆయా పరిస్థితులు, ప్రభుత్వాల చర్యలను బట్టి అందులో వ్యత్యాసం కనిపిస్తోంది. కరోనా, లాక్​డౌన్​ల కారణంగా సర్వే రెండు దశల్లో సాగింది. మొదటి దశలో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. ఈ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా చండీగఢ్​లో 1.4 ఉండగా, ఉత్తరప్రదేశ్​లో 2.4గా నమోదైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, యూపీ మినహా రెండో దశలో సర్వే జరిగిన అన్ని రాష్ట్రాల సంతానోత్పత్తి రేటు2.1గా రికార్డు అయింది. రెండో దశ సర్వేలో హర్యానా, అస్సాం, గుజరాత్ ఉత్తరాఖండ్, మిజోరాం రాష్ట్రాలు 1.9 వద్ద ఉండగా, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో సంతానోత్పత్తి రేటు 1.8గా నమోదైంది. 1.7 రేటు సాధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అత్యల్పంగా 1.6 నమోదు కావడం గమనార్హం.
 

చిన్న వయసులో పెండ్లి..
దేశంలో యువతీ, యువకులు చట్టబద్ధమైన పెండ్లి వయసు రాకముందే వివాహం చేసుకుంటున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడైంది. 18 నుంచి 29 ఏండ్ల వయసు గల యువతుల్లో 25 శాతం మంది, 21 నుంచి 29 ఏండ్ల మధ్య వయసు ఉన్న యువకుల్లో 15 శాతం మంది పెండ్లి వయసు రాకముందే వివాహం చేసుకున్నట్లు సర్వేలో తేలింది. 
 

పురుషుల వైఖరి మారాలె..
సర్వే హైలైట్ చేసిన మరో సమస్య కుటుంబ నియంత్రణ పట్ల పురుషుల వైఖరి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. గర్భనిరోధక విధానాలు పాటించాల్సిన బాధ్యత మహిళలదేనని దేశంలో 35 శాతం పురుషులు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇందులో కమ్యూనిటీల వారీగా చూస్తే అత్యధికంగా సిక్కుల్లో 64.7 శాతం, హిందువుల్లో 35.9 శాతం, ముస్లింలలో 31.9 శాతం భావిస్తున్నట్లుగా తేలింది. నిజానికి ఆడవారికి చేసే ట్యూబెక్టమీ కంటే మగవారికి చేసే వేసెక్టమే చాలా సులభమైన ప్రక్రియ. కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకునేందుకు పురుషులు ముందుకు రాని పరిస్థితి ఇప్పటికైనా మారాలి. 2045 నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో 2000 సంవత్సరంలో రూపొందించిన జాతీయ జనాభా విధాన లక్ష్యాల సాధన కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పుదారి పట్టించే కథనాలకు బదులు, సంతానోత్పత్తి మూలకాలైన అక్షరాస్యత, ఆదాయ ఉత్పత్తి, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ సేవలపై దృష్టి పెట్టాలి. ఇది ఊహించిన దానికంటే చాలా త్వరగా దేశాన్ని జనాభా వృద్ధి స్థిరీకరణ వైపు తీసుకెళ్తుంది.
 

విధానపరమైన చర్యలు అవసరం
అక్షరాస్యులు, నిరక్షరాస్యులను బట్టి సంతానోత్పత్తి రేటు ఉంటోందన్నది కీలక అంశం. చదువుకున్న మహిళల్లో ఆ రేటు తక్కువగా ఉంటోందంటే, కుటుంబ నియంత్రణను పాటించడంలో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. బాలికా విద్యపై మరింత ఫోకస్​ పెట్టాలని ప్రజారోగ్య నిపుణులు, డాక్టర్లు కోరుతున్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లుగా బాలికలకు సరైన విద్య అందితే పుట్టే పిల్లలు సహా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా జనాభా నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. దీంతో పాటు కుటుంబ నియంత్రణ, సంతానోత్పత్తిపై పెద్దలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇలాంటి చర్యలు చేపడుతున్న ఎన్​జీవోలను, సంస్థలను ప్రోత్సహించాలి. బలవంతపు పెండ్లిళ్లు, బాల్యవివాహాలు, పెండ్లికి ముందు గర్భధారణ నియంత్రణలో శ్రద్ధ సంతానోత్పత్తి రేటు అదుపులో కీలకం. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలి.