ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అస్వస్థత

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. జ్యుడీషిల్‌ కస్టడీలో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్‌కు సోమవారం (జూన్ 20న) ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గాయి. దీంతో లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జైన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. 

ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌.. కోల్‌కతాకు చెందిన షెల్‌ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మే 30వ తేదీన అరెస్ట్‌ చేసింది. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం ఈ నెల 13న కోర్టు 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మరోవైపు సత్యేంద్ర జైన్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఈ నెల 19న తిరస్కరించింది.