ప్రచారం కోసమే అనలేం..లాఠీచార్జ్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

ప్రచారం కోసమే అనలేం..లాఠీచార్జ్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
  • వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆర్డర్
  • కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ

న్యూఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నిర్వహించిన పార్లమెంట్‌‌ మార్చ్ లో విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, ఢిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసుల చర్యలు ‘దేశ అంతరాత్మను కదిలించింది’ అంటూ పిటిషనర్లు ఆరోపించారు.

ఈ పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌‌జీ) ఎస్.వి.రాజు వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లు ‘కేవలం ప్రచారం కోసం వేసినవి’ అని పేర్కొన్నారు. దీంతో ప్రచారం కోసమే వేసినవని భావించలేమని సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాల బెంచ్ వ్యాఖ్యానించింది. లాఠీ చార్జ్ ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలని ఆదేశిస్తూ ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎన్. హరిహరన్, వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను నిరసనకారులు ఆచరిస్తుంటే పోలీసులు ఉక్కుపాదం మోపారని తెలిపారు. మహిళల ప్రైవేట్ భాగాలపై దాడులు చేయడం, లాఠీలతో కొట్టడం జరిగిందని పేర్కొన్నారు. 90 మందికి పైగా ఆందోళనకారులు గాయపడ్డారని, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో సమగ్ర విచారణ జరగాలని కోరారు.

మరో పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్.. నిరసన ప్రాంతం నుంచి కార్యకర్త సోనమ్ వాంగ్‌‌చుక్‌‌ను అక్రమంగా ఖాళీ చేయించారని, సోమవారం జరిగిన మార్చ్‌‌లో నిరసనకారులపై, మహిళలు, చిన్నారులపైనా టియర్ గ్యాస్ ప్రయోగించారని తెలిపారు. మేకులున్న లాఠీలను ఉపయోగించారని, సివిల్ డ్రెస్సుల్లో ఉన్న పోలీసులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసినట్లు తమ వద్ద వీడియో ఆధారాలున్నాయని కోర్టుకు నివేదించారు.

నిరసనకారులు హింసకు పాల్పడ్డారు..

ఈ వాదనలను ఏఎస్‌‌జీ ఎస్.వి. రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనకారులు హింసాత్మకంగా ప్రవర్తించడం వల్ల పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని తెలిపారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికే, లైమ్‌‌లైట్ కోసం పాకులాడటానికే ఈ పిటిషన్లు దాఖలు చేశారని ఆయన వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.