ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఇందర్‌పురిలో 28 ఏళ్ల వీణా కుమారి అనే మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె చనిపోయే కొన్ని నిమిషాల ముందు తన సోదరికి కాల్ చేసింది.
కాల్ కట్ అవ్వడానికి ముందు.. ఆమె తన సోదరితో "దీదీ ముఝే బచా లో" (నన్ను కాపాడు, అక్కా) అని చెప్పింది. ఇవే ఆమె చివరి మాటలు. ఏడు నిమిషాల తర్వాత వీణా మరణించింది. ఆమె భర్త రాజు సింగ్ (27), ఆమె మూడు అంతస్తుల పై నుంచి పడిపోయిందని చెప్పుకొచ్చాడు.
అయితే.. వరకట్నం కోసం భర్త, అత్తింటి వాళ్లు వేధించారని.. ఆమెపై శారీరక దాడి చేశారని ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాజు సింగ్, అతని తమ్ముడు రాజ్‌కుమార్ (22)లను అరెస్టు చేశారు. వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మే 18వ తేదీ రాత్రి జరిగింది.
వీణా కుమారి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9:55 గంటల సమయంలో వీణ తన సోదరి రీనాకు ఫోన్ చేసి హెల్ప్ అడిగింది. "దీదీ ముఝే బచా లో. యే ముఝే బహుత్ మార్ రహే హైం. మెయిన్ బచుంగీ నహీ... ముఝే జాన్ సే మార్ దేంగే యే," (సిస్టర్, నన్ను రక్షించండి. వాళ్లు నన్ను భయంకరంగా కొడుతున్నారు. నేను బతకలేను.." వారు నన్ను చంపేస్తారంటూ వార్తలు వచ్చాయి.) అని ఆమె తన సోదరికి చెప్పింది. తాను చనిపోయాక తన ఆరు నెలల పిల్లాడిని చూసుకోవాలని వీణ తన సోదరిని కోరింది. రీనా తన చెల్లికి, అత్తమామలకు తిరిగి ఫోన్ చేసింది. కానీ ఎవరూ ఫోన్ తీయలేదు. కంగారుగా వీణ ఇంటికి ఆమె సోదరి ఇంటికి వెళ్లింది.
ఏడు నిమిషాల తర్వాత.. రాత్రి 10:02 గంటలకు, రీనాకు వీణా చనిపోయిందని.. రూఫ్ పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిందని వీణా అత్తింటి వాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీణ, రాజులకు పెళ్లై మూడేళ్లయింది. వీణా సోదరుడు చెప్పిన దాని ప్రకారం.. ఆమె అత్తమామలు ఇచ్చిన కట్నంతో సంతృప్తి చెందక, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను కోరుకున్నారు. కట్నం కోసం తన సోదరిని వేధించి ప్రాణం తీశారని వీణ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
