కాన్పు పైసలు పడ్తలేవ్​

కాన్పు పైసలు పడ్తలేవ్​
  •     కొన్నిచోట్ల ఏడాది, రెండేళ్లుగా పత్తాలేని సర్కారు సాయం
  •     గడిచిన ఆరు నెలల్లో రూ.180 కోట్లు పెండింగ్

కేసీఆర్ కిట్​స్కీం కింద సర్కారు దవాఖానల్లో పురుడు పోసుకునే పేద మహిళలకు ఇచ్చే కాన్పు పైసలు ఆరు నెలలుగా పడ్తలేవు. కొన్నిచోట్ల ఏడాది, రెండేళ్లుగా పత్తాలేవు. మాతాశిశు సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేసీఆర్ ​కిట్లతో సరిపెడుతోంది. గడిచిన ఆరు నెలల్లో  ఏకంగా రూ.180 కోట్లు పెండింగ్ పెట్టడంతో గర్భిణులు, బాలింతలకు ఎదురుచూపులు తప్పట్లేదు.  

డెలివరీలను ప్రోత్సహించాలనే.. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించడం.. నిరుపేద గర్భిణులు, బాలింతలకు విడతల వారీగా పౌష్టికాహారం అందించి మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా  రాష్ట్ర సర్కారు 2017 నుంచి కేసీఆర్ ​కిట్ స్కీం అమలుచేస్తోంది. సర్కారు దవాఖానలో పురుడు పోసుకునే మహిళలకు మొదటి రెండు కాన్పులకు ఈ స్కీం వర్తిస్తుంది. పథకంలో భాగంగా గర్భిణులు సబ్ సెంటర్​లో తమ పేర్లు నమోదు చేసుకున్నప్పుడే తొలి విడతగా రూ.3 వేలు అకౌంట్​లో జమ చేయాలి. డెలివరీ అయ్యాక బాబు పుడితే రూ.4 వేలు, పాప పుడితే రూ.5 వేలు అందించాలి. మూడున్నర నెలలకు ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు వేయిస్తే.. రూ.2 వేలు, తొమ్మిది నెలల పాపకు విటమిన్​ఏ ఇచ్చేటప్పడు చివరి విడతగా రూ.3 వేలు ఇవ్వాలి. మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల అకౌంట్లలో ఇన్సెంటివ్ జమ చేయాలి. డెలివరీ అయ్యే నాటికి ఆడపిల్ల అయితే రూ. 13 వేలు, మగ పిల్లాడైతే.. రూ. 12 వేలు క్యాష్​ అందే విధంగా ఈ స్కీంను రూపొందించారు. ఈ స్కీం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగాయి. 

ఆరు నెలలుగా అందట్లే.. 

2018 ముందస్తు ఎన్నికల వరకు కేసీఆర్ కిట్​స్కీం సక్రమంగానే అమలైంది. ఎన్నికల సన్నాహాలు మొదలైనప్పటి నుంచే ఈ స్కీం అమలులో ప్రాబ్లమ్స్​మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన మహిళలకు రూ.2వేలు విలువజేసే కేసీఆర్ కిట్​ రెగ్యులర్​గా ఇస్తున్నప్పటికీ క్యాష్​ ఇవ్వడంలో లేట్ చేస్తున్నారు. నాలుగు విడతల్లో పైసలు ఇవ్వాల్సి ఉన్నా.. ప్రతి విడతలోనూ పెండింగ్‌‌‌‌లే ఉంటున్నాయి. చివరి విడత వచ్చేసరికి ఏడాది, రెండేండ్లు కూడా పడుతోందంటే పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గడిచిన ఆరు నెలలుగా దాదాపు అన్ని జిల్లాల్లో పేమెంట్లు నిలిచిపోయాయి. ఆఫీసర్ల రిపోర్టు ప్రకారమే రెండేండ్ల కింద డెలివరీ అయిన వారిలో వేలమందికి ఇంకా డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.180 కోట్లు పెండింగ్​లో ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక్క సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 57,961 మంది క్యాష్​ కోసం నిరీక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో 10,656 మంది, రెండో విడతలో 4,624 మంది, మూడో విడ తలో 11,880 మంది, నాలుగో విడతలో 10,488 మందికి రావాల్సి ఉండగా యాదాద్రి జిల్లాలో మొదటి విడతలో 5,524 మంది, రెండో విడతలో 5,919 మంది, మూడో విడతలో 6,403 మంది, నాలుగో విడతలో 6,162 మందికి పైసలు పడాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తే ఆ పైసలతో గర్భిణులకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందే అవకాశం ఉండేది. అలా చేయకపోవడం వల్ల స్కీం లక్ష్యం నెరవేరట్లేదు.