అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లాభం 37 శాతం డౌన్​

అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లాభం 37 శాతం డౌన్​
  • మార్చి క్వార్టర్​లో రూ.450 కోట్లు

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూపు  ఫ్లాగ్‌‌‌‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్​కు మార్చి క్వార్టర్​లో నికర లాభం 37 శాతం తగ్గింది. ఎయిర్‌‌‌‌పోర్ట్ బకాయిలు,  వాణిజ్య, మైనింగ్ నష్టాలే ఇందుకు కారణం. ఈ ఏడాది -మార్చిలో దాని ఏకీకృత నికర లాభం రూ. 450.58 కోట్లు కాగా, - గత ఏడాది ఇదే కాలంలో రూ. 722.48 కోట్ల నికర లాభం వచ్చింది.  అంతకు ముందు క్వార్టర్​లో రూ. 1,888.45 కోట్లు వచ్చాయి.  తాజా క్వార్టర్​లో ఇబిటా 8 శాతం క్షీణించి రూ. 3,646 కోట్లకు చేరుకుంది. న్యూ ఎనర్జీ,  ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ల వంటి  వ్యాపారాలు బలమైన ఊపును కనబరిచినప్పటికీ, కమర్షియల్ మైనింగ్‌‌‌‌లో సంస్థ రూ. 201.83 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

  అయితే రహదారి వ్యాపారం నుంచి పన్నుకు ముందు ఆదాయాలు 84 శాతం క్షీణించి రూ. 222.03 కోట్లకు చేరుకున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్​) గత చెల్లింపుల కోసం కేటాయించిన రూ. 627 కోట్లను ఒకేసారి అసాధారణమైన ఖర్చుగా గుర్తించింది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , సోలార్ మాడ్యూల్  విండ్ టర్బైన్ తయారీతో సహా కొత్త ఇంధన వ్యాపారాన్ని కలిగి ఉన్న కంపెనీ యూనిట్. దీని ఇబిటా 6.2 రెట్లు వృద్ధిని రూ. 641 కోట్లకు చేరుకుంది. విమానాశ్రయాల వ్యాపారంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగి రూ.662 కోట్లకు చేరుకుంది.

 మార్చి 31 నాటికి మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 28,943.84 కోట్ల ఆదాయం రూ.29,180.02 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం 2023–-24లో నికర లాభం 31 శాతం పెరిగి రూ.3,240.78 కోట్లకు చేరుకుంది.  2024 ఆర్థిక సంవత్సరం కోసం దాని ఏకీకృత ఇబిటా 32 శాతం పెరిగి రూ. 13,237 కోట్లకు చేరుకుంది. ఇంక్యుబేటింగ్ వ్యాపారాలు వార్షికంగా 47 శాతం వృద్ధి చెందాయి.