నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ 20కి వాయిదా

నేషనల్ హెరాల్డ్ కేసులో  విచారణ 20కి వాయిదా

న్యూఢిల్లీ: నేషనల్‌‌ హెరాల్డ్‌‌ మనీలాండరీంగ్‌‌ కేసులో విచారణను వాయిదా వేయాలన్న కాంగ్రెస్ నేత రాహుల్‌‌ గాంధీ విజ్ఞప్తికి ఎన్ ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) అంగీకరించింది. మనీ లాండరింగ్‌‌ కేసులో మూడ్రోజులుగా రాహుల్‌‌ విచారణ ఎదుర్కొన్నారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని ఈడీ బుధవారం సమన్లు ఇచ్చింది. అయితే, తన తల్లి సోనియా ఆస్పత్రిలో ఉందని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరుతూ రాహుల్ గురువారం లేఖ రాశారు. దీంతో రాహుల్ విజ్ఞప్తి మేరకు విచారణను 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఈడీ   వెల్లడించింది. 

కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు 

రాహుల్‌‌ పై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌ ఆందోళనలు కొనసాగుతున్నాయి.  బుధవారం ఏఐసీసీ ఆఫీసు వద్ద జరిగిన తోపులాటలో కాంగ్రెస్‌‌ కార్యకర్తలు తమపై దాడి చేశారని, పబ్లిక్‌‌ ప్రాపర్టీని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ గురువారం గుర్తుతెలియని పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేశారు. ఆందోళనకారులు తమ సిబ్బందిపై దాడి చేశారని పేర్కొన్నారు.