డాక్టర్ దేవుళ్లు.. 1100 మంది యాచకులకు ఫ్రీ ట్రీట్ మెంట్

డాక్టర్ దేవుళ్లు.. 1100 మంది యాచకులకు ఫ్రీ ట్రీట్ మెంట్

కంటికి కనిపించని దేవుళ్లు గుళ్లో ఉంటారు. కంటికి కనిపించే ఈ దేవుడు మాత్రం రోజూ ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్తాడు. లోపలున్న ఆ దైవాలను దర్శించుకునేందుకు కాదు. బతకడానికి చేయి చాచి అర్థించే యాచకుల కోసం. వెళ్లి ఆ చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుంటాడు. పక్కనే కూర్చుంటాడు. ప్రేమతో పలకరిస్తాడు. పట్టెడు బువ్వపెడతాడు. పీడుస్తున్న జబ్బు లకు ట్రీట్ మెంట్చేస్తాడు ఈ డాక్టర్ దేవుడు అభిజీత్ సోనావానే.

ఆముక్కోటి దేవతలకు మల్లే ఈ దేవుడికీ ఓ దేవత ఉంది.అతను సాయం చేయడానికి అహర్నిశలు తపిస్తుంటే, చిరు దివ్వెల మారి ఆ తపనకు దారి చూపుతోంది ఈ డాక్టర్ దేవత మనీషా సోనావానే.  చిన్న క్లినిక్ నడుపుతూ ప్రతి చిల్లి గవ్వా కూడబెట్టి, యాచకులకు ట్రీట్ మెంట్, మందులకు డబ్బు అందిస్తోంది. శరీరానికి వచ్చే జబ్బులు చాలా మంది డాక్టర్లు నయం చేయగలరు. కానీ మనసుకు తగిలిన గాయాలను తగ్గించడంలో అభిజీత్ తనకు తానేసాటి. మూడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. యాచకుల సేవలో తనను తాను మర్చిపోయిన డా.అభిజీత్కుటుంబ సభ్యుల సంఖ్య1100 చేరింది. వీళ్లను కలుసుకోవడానికి రోజూ ఉదయం 10 గంటలకు రెండుసంచుల మందులతో బైక్ మీద అభిజీత్ బయల్దేరివెళ్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ పుణెనలుమూలలా తిరుగుతారు. కనిపించిన యాచకులవద్దకు వెళ్లి రోడ్డు మీదే ట్రీట్ మెంట్ చేస్తారు. అవసరమైతే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్తారు.

భార్య మనీషాతో కలిసి 160 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేశారు అభిజీత్. ఇలా 1100 మందికి ఒకసారి ట్రీట్ మెంట్ చేయడానికి దాదాపు 15 రోజులు పడతాయి.జబ్బు తగ్గిపోయి, మంచిగైన ముసలోళ్లను బిచ్చమెత్తుకోవడం నుంచి బయటకు తేవడానికి అభిజీత్ కృషిచేస్తున్నారు. తొలుత వాళ్ల మనసుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. పూర్తిగా దగ్గరైన తర్వాత, చెబితేవింటారనుకు న్న సమయంలో ఈ వృత్తి నుంచి బయటకు రావాలని వాళ్లను కోరతారు. ఇప్పటిదాకా 49 మందికి డబ్బు సాయం చేసి సొంతంగా చిన్న వ్యాపార దుకాణాలు తెరిపించారు. ‘‘హెల్త్సర్వీస్ అందించడం మా లక్ష్యం కాదు. యాచకుల మనసును చూరగొనడం మా కల” అని అభిజీత్తెలిపారు. మెడిసిన్స్, సర్జరీలు, ట్రీట్ మెంట్ కోసం క్లినిక్, విరాళాల ద్వారా వస్తున్న డబ్బు సరిపోడంలేదు. దీంతో ‘మిలాప్’ ద్వారా రూ.15 లక్షలు క్రౌడ్ ఫండింగ్ చేయాలని అభిజీత్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దాదాపు 709 మంది డొనేషన్ల ద్వారా14.24 లక్షల సాయం అందించారు.