- కోఠి డీఎంఈ ఆఫీసు వద్ద ధర్నా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్ల బదిలీలు జీవో38 ప్రకారమే చేపట్టాలని, కొత్త రూల్స్ తెస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) హెచ్చరించింది. గురువారం హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ఆఫీసు వద్ద డాక్టర్లు ధర్నా చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి. నరహరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లను బలవంతంగా మార్చకూడదన్నారు.
వారు స్వయంగా కోరినా, వేరే ఎవరైనా ఆ పోస్టును అడిగితేనే మార్పు చేయాలని డిమాండ్ చేశారు. బదిలీల్లో గోల్ మాల్ జరగకుండా ఆఫ్ లైన్, ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లకు కనీసం 2 ఏండ్ల సర్వీసును అర్హతగా ఉంచాలని కోరారు. ఫోకల్ – నాన్ ఫోకల్ ప్రాంతాల నిర్వచనాలను మార్చే ప్రయత్నం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫోకల్ – నాన్ ఫోకల్ అంశం అనేది ఒక తేనెతుట్టె వంటిదని.. దాన్ని అనవసరంగా కదిలించి డాక్టర్లలో వివక్ష భావనలు పెంచవద్దని హెచ్చరించారు. డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనరేట్ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్లలో అసహనం పెంచకుండా ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, డాక్టర్ ఎం.కె. రౌఫ్, డాక్టర్ బి. రమేశ్, డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
