రూ.కోటి తీసుకొని వదిలేశారు

రూ.కోటి తీసుకొని వదిలేశారు
  •  3 కోట్ల రూపాయలు డిమాండ్​ చేసిన కిడ్నాపర్లు
  •  పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
  •  నిందితుల కోసం ఆరు స్పెషల్ టీమ్స్ తో గాలింపు

దోమలగూడలో ఫైనాన్స్​ నిర్వహిస్తున్న వ్యాపారి గజేంద్ర పరేఖ్​​ కిడ్నాప్​ అయ్యాడన్న వార్త సిటీలో కలకలం రేపింది. శివారులో ఈ మధ్యే జరిగిన యువతి కిడ్నాప్ ​మరువక ముందే మరో ఘటన జరిగింది. సినీ ఫక్కీలో దుండ గులు వ్యాపారిని వెంబడించి ఏవీ కాలేజీ సమీపంలో దొరకబట్టుకున్నారు. కాళ్లు, చేతులు బంధించి కారులో తీసుకెళ్లారు. రూ.3 కోట్లు ఇస్తేనే వదిలేస్తామని డిమాండ్ ​చేశారు. తన వద్ద అంత మొత్తం లేదని చెప్పినా వినిపించుకోలేదని, శివారు ప్రాంతంలోని  ఓ అపార్ట్​మెంట్​కు తరలించి బంధించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు రాహుల్​ ద్వారా రూ. కోటి ఇప్పించడంతో అబిడ్స్​లో తనను దింపేసి పరారైనట్టు పేర్కొన్నాడు. ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ కేసు దర్యాప్తులో వేగం పెంచారు.

హైదరాబాద్, వెలుగు:  చిక్కడపల్లిలో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి ఫైనాన్స్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ. కోటి తీసుకుని వదిలిపెట్టి పారిపోయారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వ్యాపారి ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు కిడ్నాపర్ల కోసం 6 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. బాధితుడి కథనం ప్రకారం  చిక్కడపల్లి ఇన్ స్పెక్టర్ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

పదేళ్లుగా ఫైనాన్స్ వ్యాపారం

రాజస్థాన్ కు చెందిన గజేంద్ర పరేక్(40) ఆటోమొబైల్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. పదేళ్లుగా హిమాయత్ నగర్ రోడ్  స్ట్రీట్ నంబర్-17లో ఉంటున్న గజేంద్ర ముంబయికి చెందిన ‘ఫార్య్చూన్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్’ కంపెనీతో ఫ్రాంచైజీ పెట్టుకున్నాడు. దోమల్ గూడ స్ట్రీట్ నం.6లో ‘మైనా ఫైనాన్స్’ పేరుతో కార్లు, బైక్స్ కి లోన్లు ఇచ్చేవాడు. వ్యాపారంలో భాగంగా గజేంద్ర ముంబయి, గుజరాత్, కర్నాటక, చెన్నై లాంటి రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలతో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. దోమల్ గూడలో తన ఫైనాన్స్ కార్యకలాపాలు ముగిసిన తర్వాత ప్రతి రోజు రాత్రి 11గంటల ప్రాంతంలో గజేంద్ర హిమాయత్ నగర్ లోని తన ఇంటికి వెళ్లేవాడు.

దోమలగూడలో కిడ్నాప్

ఆదివారం రాత్రి ఆఫీసు పని ముగిసిన తర్వాత గజేంద్ర పరేక్ దోమలగూడ నుంచి ఇంటికి బయలుదేరాడు.  రాత్రి 11.15 గంటలకు ప్రాంతంలో దోమల్ గూడ రోడ్డుపై గజేంద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఏవీ కాలేజ్ సమీపంలోకి చేరుకోగానే కారులో వచ్చిన  సుమారు ఆరుగురు గుర్తుతెలియని దుండగులు గజేంద్ర పరేక్ కళ్లకు గంతలు, కాళ్లు చేతులకు తాళ్లు బిగించి కిడ్నాప్ చేశారు.  గజేంద్ర పరేక్ ను కిడ్నాప్ చేసిన కారును వెనుక మరో కారు..బైక్ ఫాలో అయ్యాయి. ఆ తర్వాత గజేంద్రను కిడ్నాపర్లు శివారు ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ కి తరలించి అక్కడ బంధించారు. తమకు రూ.3కోట్లు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని వారు గజేంద్రను బెదిరించారు.

ఫ్రెండ్ కి ఫోన్ చేసి..

కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.3కోట్లు తన దగ్గర లేవని గజేంద్ర వారితో చెప్పాడు. కేవలం రూ.50లక్షలు మాత్రమే ఇవ్వగలనన్నాడు. అయినప్పటికీ కిడ్నాపర్లు తనపై దాడి చేశారని..గజేంద్ర పరేక్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ లో పేర్కొన్నాడు. చివరికి రూ.కోటి సర్దుబాటు చేస్తానని గజేంద్ర కిడ్నాపర్లతో చెప్పాడు. తన ఫ్రెండ్ రాహుల్ కి ఫోన్ చేసిన గజేంద్ర రూ.కోటి డబ్బు ఏర్పాటు చేయాలన్నాడు. ఆ తర్వాత కిడ్నాపర్లు చెప్పిన విధంగా రాహుల్ తో వారికి రూ.కోటి ఇప్పించానని గజేంద్ర పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపాడు. డబ్బులు తీసుకున్న కిడ్నాపర్లు సోమవారం తెల్లవారుజామున 4.30గంటల ప్రాంతంలో తనను అబిడ్స్ లోని బాంబే జ్యూస్ సెంటర్ వద్ద వదిలి పారిపోయినట్టు గజేంద్ర పరేక్ పోలీసులకు వివరించాడు. చిక్కడపల్లి పోలీసులు వ్యాపారి గజేంద్ర ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆర్థిక లావాదేవీలపై ఆరా

ఏవీ కాలేజ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలతో పాటు అబిడ్స్ లోని  బాంబే జ్యూస్ సెంటర్ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితుడు ఆటోమొబైల్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండడంతో ఆర్థికపరమైన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల దాడిలోఎడమ చేతికి గాయమై హైదర్ గూడ అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న గజేంద్ర పరేక్ ను అన్ని కోణాల్లో విచారించారు. గజేంద్ర పరేక్ సోదరుడు కమలేశ్​పై ముంబయిలో రూ.23కోట్ల చీటింగ్ కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఫార్య్చూన్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఆర్థిక లావాదేవీల్లో మోసం చేసినందుకే కమలేశ్ ను ముంబయి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం కమలేశ్ ముంబయి జైల్లో ఉన్నట్లు వివరాలు రాబట్టారు. 6 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఇన్ స్పెక్టర్ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

వ్యాపారి ఫ్రెండ్ రాహుల్ ని విచారిస్తాం

వ్యాపారి గజేంద్ర పరేక్ ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసును సీరియస్ గా తీసుకున్నాం. కంప్లయింట్ అందిన వెంటనే స్పెషల్ టీమ్స్  ఏర్పాటు చేశాం. బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. రూ.కోటి ఇచ్చిన రాహుల్ ను విచారిస్తాం. ఈ కిడ్నాప్ లో ఆరుగురు పాల్గొన్నట్లు బాధితుడు చెప్తున్నాడు. కిడ్నాప్, దాడికి గల కారణాలను విశ్లేసిస్తున్నాం. నిజానిజాలను తేల్చి బాధ్యులైన వారిని అరెస్ట్ చేస్తాం.