తలుపులు మూసి.. పరదాలు వేసి పరీక్ష

తలుపులు మూసి.. పరదాలు వేసి పరీక్ష
  • తలుపులు మూసి.. పరదాలు వేసి..
  • ఆసిఫాబాద్​లో గుట్టుచప్పుడు కాకుండా సెక్రెటరీలకు పరీక్ష

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సెక్రెటరీలకు పరీక్ష పెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా తలుపులు మూసి.. పరదాలు వేసి ఎంపీడీవో ఆఫీసుల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పెషల్ స్క్వాడ్, ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించారు. కనీసం పరీక్ష పేపర్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో జరిగిన పరీక్ష సెక్రెటరీల్లో చర్చకు దారి తీసింది. రిజల్ట్ ఆధారంగా ఏం చేస్తారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

నాలుగు సెట్ల పరీక్ష పేపర్
సెక్రెటరీల పరీక్షకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్​ గురించి పూర్తిగా స్టడీ చేసి క్వశ్చన్​ పేపర్​ తయారు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా నాలుగు సెట్లు రెడీ చేసి ఇవ్వడం గమనార్హం. వంద మార్కుల పేపర్ లో మల్టిపుల్ చాయిస్, ఖాళీల పూరింపుతో పాటు నాలుగు లైన్ల జవాబు రాసేలా ప్రశ్నలు ఇచ్చారు. పంచాయతీరాజ్ యాక్ట్ లోని దాదాపు కీలకమైన 20 సెక్షన్ల గురించి, ఫీల్డ్ లెవెల్ లో రోజూ చేసే అంశాలపై ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి.