డబుల్ బెడ్రూం ఇళ్లు మిగిలినవి ఇవ్వట్లే

డబుల్ బెడ్రూం ఇళ్లు మిగిలినవి ఇవ్వట్లే
  •     లబ్ధిదారులు కోరుతున్నా కేటాయించట్లే
  •     నెలలు గడుస్తున్నా.. తాళాలు వేసే ఉంటున్నయ్
  •     లబ్ధిదారులను గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యం


హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని డబుల్​ బెడ్రూమ్​ఇండ్లలో లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన వాటిని అందించడంలేదు. ఇప్పటివరకు 22 ప్రాంతాల్లో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను ప్రారంభించారు.ఇందులో 14  ప్రాంతాల్లో కొన్ని బెడ్రూమ్ ఇండ్లను ఖాళీగా ఉంచారు. పంపిణీ సమయంలో అర్హులైన వారిని గుర్తించి అందజేస్తామన్నప్పటికీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఆరేండ్లుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మించిన 5,109 డబుల్​ బెడ్రూమ్ ఇండ్లలో 3,807  పంపిణీ చేయగా,  మిగతా 1,302  ఖాళీగానే ఉన్నాయి. డబుల్​ఇండ్లు ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రులు కూడా త్వరలోనే అందజేస్తామని  చెబుతున్నా ఆ విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు. అధికార పార్టీ  నేతలకు  ఇచ్చేందుకే ఖాళీగా ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ ప్రాంతాల్లో పంపిణీ 

ఐడీఎఫ్ సీ కాలనీ, ఎరుకల నాంచారమ్మ బస్తీ, చిత్తారమ్మ బస్తీ , సింగం చెరువు తండా, నాచారం, కిడికి బూద్ ఎలిసా,  సయ్యద్ సాబ్ కా బాడ, జియాగూడ,  కట్టెలమండి, గోడేఖీకబర్, లంబడితండా,  వనస్థలిపురం, గాంధీనగర్,​ కంటోన్మెంట్ ఏరియాలోని సాయిరాంనగర్​, అంబేద్కర్​నగర్,  పొట్టిశ్రీరాములునగర్, జీవై రెడ్డి నగర్, గొల్ల కొమరయ్య కాలనీ, బన్సీలాల్​పేట్ జీవైఆర్ కాంపౌండ్, చంచల్ గూడ పిల్లి గుడిసెలు, కట్ట మైసమ్మ  సిల్వర్ కాంపౌండ్, బన్సీలాల్​ పేట్​(సీసీనగర్) ప్రాంతాల్లో 5,109 డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను నిర్మించారు. వీటిలో కొన్ని ప్రాంతాల్లోని ఇండ్లను లబ్ధిదారులకు  పంపిణీ చేయకుండా ఖాళీగా పెట్టారు. ఇందులో ఎక్కువగా జియాగూడలోనే  267 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ నగర్, గాంధీనగర్, వనస్థలిపురం, గోడేఖీకబర్, బన్సీలాల్​పేట్, పిల్లి గుడిసెలు, కట్టమైసమ్మ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఖాళీగా కనిపిస్తున్నాయి.  ఇలా అన్ని ప్రాంతాల్లో కలిపి వేయి ఇండ్లు ఉన్నాయి. వాటిని ఎవరికీ కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటుండగా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 

ఇండ్లను ఇవ్వడంలేదంటూ.. 

చాలా ప్రాంతాల్లోని మురికివాడల్లో తమ ఇండ్లను ఖాళీ చేయించి డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను ఇవ్వడం లేదంటూ అర్హులు ఆందోళనకు దిగుతున్నారు. గతంలో 30, 40 గజాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నా సంతోషంగా ఉండేవాళ్లమని వాపోతున్నారు.ఇండ్లను ప్రారంభించినప్పుడు ఖాళీగా ఉన్న వాటిని కూడా  అర్హులను గుర్తించి త్వరలో అందజేస్తామన్నప్పటికీ  ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో లబ్ధిదారులు ఓపిక నశించి కట్టెలమండిలో ఇండ్ల తాళాలను పగలగొట్టుకొని కొన్నినెలల కిందట ఆక్రమించారు. వారిని పోలీసుల సాయంతో అధికారులు ఖాళీ చేయించారు. ఆ తర్వాత  ఆందోళనలు వ్యక్తం చేయడంతో  వాళ్లను అదే ఇండ్లలో ఉండనిస్తున్నారు. కానీ నేటికి కూడా వారికి అధికారికంగా మాత్రం ఇండ్లను అందించలేదు. 

ఆఫీసుల చుట్టూ చక్కర్లు

డబుల్ బెడ్రూమ్​ఇండ్లలో పంపిణీ చేయగా మిగిలిన ఫ్లాట్లను ఎప్పుడిస్తరోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. బయట కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా కూడా కేటాయించే విషయంపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపో తుండగా స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ అర్హులు చక్కర్లు కొడుతున్నా  ఎవరూ పట్టించుకోవడంలేదు. వాటిని అసలు ఎప్పుడిస్తారో కూడా తెలియట్లేదు. 

కిరాయి కట్టలేకపోతున్నం

ఖాళీగా ఉన్న ఇండ్లను ఇస్తామని ఇంకా ఇయ్యట్లేదు. బయట కిరాయి కట్టలేకపోతున్నం.  అధికారులు పట్టించుకొని తమకు ఇండ్లను ఇవ్వాలె. ఉన్న ఇండ్లను కోల్పోయి ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలె. లబ్ధిదారులమని చెప్పినా ఇండ్లు మాత్రం ఇవ్వడం లేదు.
- గంగుబాయి, అంబేద్కర్ నగర్

స్థానికులకు ఇవ్వకుంటే ఊరుకోం..

జియాగూడలో 840 ఇండ్లు నిర్మించగా, ఇందులో 267 ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రారంభించి ఏడాదిన్నర అయినా కూడా అర్హులకు ఇవ్వడంలేదు. స్థానిక నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలి.  వేరే వాళ్లకు ఇస్తామంటే ఊరుకోం. కొందరు ప్రజాప్రతినిధులు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే మానుకోవాలి. 
– దర్శన్, కార్పొరేటర్, జియాగూడ