డిస్కౌంట్ల సంగతి తేల్చండి : అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు డీపీఐఐటీ ఆదేశం

డిస్కౌంట్ల సంగతి తేల్చండి : అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు డీపీఐఐటీ ఆదేశం

మూలధనం ఎలా వచ్చింది?
ఇన్వెం టరీ సంగతేంటి ?
5 టాప్ సెల్లర్స్​ ఎవరో చెప్పండి?

న్యూఢిల్లీ: అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు ఇస్తున్న డిస్కౌంట్లపై వస్తున్న ఫిర్యాదులపై డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్‌‌ ప్రమోషన్‌‌ ఆఫ్‌‌ ఇండస్ట్రీ అండ్‌‌ ఇంటర్నల్‌‌ ట్రేడ్‌‌ (డీపీఐఐటీ) స్పందించింది. ఈ ఆన్‌‌లైన్‌‌ దిగ్గజాలకు పలు ప్రశ్నలు సంధించింది. టాప్‌‌-–5 సెల్లర్లు, మూలధన సేకరణ, ఇన్వెంటరీ వంటి వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. ప్రిఫర్డ్‌‌ సెల్లర్స్‌‌ వస్తువుల ధరలు, వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు గురించి కూడా వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. మూలధనం ఎలా, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ? బిజినెస్‌‌ మోడల్‌‌ ఏంటి ? ఇన్వెంటరీని ఎలా నిర్వహిస్తున్నారు ? వంటి ప్రశ్నలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఒక ప్రశ్నాపత్రాన్ని అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు డీపీఐఐటీ పంపించింది. మెగా ఫెస్టివ్‌‌ సేల్స్‌‌తో పేరుతో ఈ రెండు ఆన్‌‌లైన్‌‌ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌డీఐల) రూల్స్‌‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, విపరీతంగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని రిటైల్‌‌ వ్యాపారం సంఘం సీఏఐటీ పలుసార్లు ఫిర్యాదు చేయడంతో డీపీఐఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై వివరణ కోసం అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లను ఈ–మెయిల్‌‌ ద్వారా సంప్రదించగా స్పందన రాలేదు.

విచారణ జరుగుతోంది…

అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇస్తున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్‌‌ గోయల్‌‌ ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ ప్రకారం ఈ–కామర్స్‌‌ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. అయితే ఇన్వెంటరీ మోడల్‌‌ కంపెనీలకు మాత్రం ఎఫ్‌‌డీఐలు సేకరించడం సాధ్యం కాదు. తన వెబ్‌‌సైట్‌‌/యాప్‌‌ ద్వారా అమ్మే వస్తువుల ధరలను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ కంపెనీలు నియంత్రించకూడదు. మరోవైపు అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ మాత్రం తాము ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను పాటిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రత్యేకంగా   డిస్కౌంట్లు ఏవీ ఇవ్వడం లేదని, బ్రాండ్లే  తమ వస్తువుల ధరలను తగ్గిస్తున్నాయని వాదిస్తున్నాయి. ప్రస్తుత పండగ సీజన్‌‌లో ఈ రెండు కంపెనీలు రూ.39 వేల కోట్ల అమ్మకాలు సాధించే అవకాశాలు ఉన్నాయని రెడ్‌‌సీర్‌‌ సంస్థ స్టడీ తెలిపింది. పండగల సీజన్‌‌ సందర్భంగా ఈ రెండు అమెరికా కంపెనీలు గత నెల 29 నుంచి ఈ నెల నాలుగు వరకు మెగా ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ నిర్వహించాయి. అంతేగాక అమెజాన్‌‌ ఈ నెల 21 నుంచి, ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఈ నెల 25 నుంచి మరోసారి దీపావళి సందర్భంగా ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ నిర్వహిస్తున్నాయి. ఇండియా స్టార్టప్‌‌ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌లో వాల్‌‌మార్ట్‌‌ 70 శాతానికిపైగా వాటా తీసుకున్న సంగతి తెలిసిందే. ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ కోసం వేలాది ప్రొడక్టులపై ఇవి భారీ ఆఫర్లు ఇచ్చాయి. కొన్ని కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్‌‌ అందించాయి. ఈఐఎం, క్యాష్‌‌బ్యాక్‌‌లతోనూ కస్టమర్లను ఆకర్షించాయి.

గతంలో మాదిరి నగరాలపైనే కాకుండా ఈసారి చిన్న పట్టణాలపై, గ్రామాలపై బాగా దృష్టి సారించాయి. తాము 99.6 శాతం పిన్‌‌కోడ్‌‌లకు పార్సిల్స్‌‌ పంపించగలిగామని అమెజాన్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. ముఖ్యంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌‌ విపరీతంగా అమ్ముడయ్యాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని వివరించారు. ఇందుకోసం అమెజాన్‌‌ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్‌‌ సెంటర్ల సంఖ్యను పెంచినట్టు చెప్పారు. అమ్మకాల విలువను ఈ రెండు కంపెనీలూ బయటపెట్టకపోయినప్పటికీ, రికార్డుస్థాయి సేల్స్‌‌ సాధించినట్టు ప్రకటించాయి.

రూల్స్‌‌ పాటించట్లేదా?

ఈ కంపెనీలు అనైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తున్నాయని, చిన్న వ్యాపారాలను తొక్కేయడానికి అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇస్తున్నాయన్నది ‘కాన్ఫిడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆల్‌‌ ఇండియా ట్రేడర్స్‌‌’ (సీఏఐటీ) వాదన. సొంత కంపెనీల ద్వారా అమ్మకాలు నిర్వహించకూడదనే రూల్స్‌‌ను పట్టించుకోవడం లేదన్నది మరో ఫిర్యాదు. అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ల అమ్మకాల్లో మెజారిటీ వాటా సొంత సెల్లర్లదే ( కంపెనీలదే) అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే డీపీఐఐటీ టాప్‌‌–5 సెల్లర్ల డేటా కోరినట్టు తెలుస్తోంది. మొత్తం సెల్లర్ల వివరాలూ ఇవ్వాలని ఆదేశించింది. కంట్రోల్‌‌లో ఉన్న, కంట్రోల్‌‌లో లేని సెల్లర్ల సంఖ్యను కూడా తెలపాలని డీపీఐఐటీ నిర్దేశించింది. టాప్‌‌–5 సెల్లర్ల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది.. వారి అమ్మకాల విలువను కూడా అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు వెల్లడించాల్సి ఉంటుంది. వీరు అమ్మే వస్తువుల పేర్లను, ధరలనూ తెలియజేయాలి. పేమెంట్‌‌ గేట్‌‌వేలతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి కూడా డీపీఐఐటీ ఆరా తీసింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో డీపీఐఐటీ ఈ–కామర్స్‌‌ కంపెనీలతోపాటు సీఏఐటీ సభ్యులతోనూ పలుసార్లు మీటింగ్‌‌లు నిర్వహించింది.

ఆన్‌లైన్‌ దిగ్గజాలు, బ్యాంకుల మధ్య అక్రమ సంబంధం
ఆరా తీయండి.. సెయిట్ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ దిగ్గజాలు, బ్రాండ్‌ సొంతదారులు, బ్యాంకుల మధ్య అక్రమ సంబంధాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తును సెయిట్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ–కామర్స్‌, పాత తరపు రిటైల్‌ స్టోర్స్‌ మోడల్స్‌ రెంటిలోనూ ఈ అక్రమాలు జరుగుతున్నాయని, మంత్రుల కమిటీ వేసి,  వీటిపై విచారణ జరిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సెయిట్‌) సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ కోరారు. వాల్‌మార్ట్‌ అధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ధరల వైఖరిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లే కాకుండా, మొబైల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్, ఫుట్‌వేర్‌, గార్మెంట్స్‌ బ్రాండ్స్‌ సొంతదారులు, బ్యాంకులు కూడా అడ్డగోలు ధరల దోపిడీకి కారణమేనని సెయిట్‌ ఆరోపిస్తోంది. బ్రాండ్‌ల సొంతదారులు ఆఫ్‌లైన్‌ మార్కెట్‌నూ దోచుకుంటున్నాయని, ఫలితంగా కాంపిటీషన్‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది.ఆన్‌లైన్‌ దిగ్గజాల పోర్టల్స్‌లో వస్తువులు కొనడానికి బ్యాంకులు క్యాష్‌ బ్యాక్‌ సహా వివిధ రకాల డిస్కౌంట్లు ఇవ్వడాన్నీ తప్పు పడుతోంది. ఆన్‌లైన్‌ దిగ్గజాలు, బ్రాండ్‌ల సొంతదారులు, బ్యాంకులు కలిసికట్టుగా వ్యవహరిస్తూ కస్టమర్లను దోచుకునే విధంగా ధరలు నిర్ణయిస్తున్నాయని సెయిట్‌ విమర్శిస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌లను త్వరలో తమ ప్రతినిధుల బృందం కలవనున్నట్లు కూడా ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. ఈ విషయంలో న్యాయం చేయమని వారందరినీ కోరనున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో కూడా అపాయింట్‌ కోరాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.