సైనా నెహ్వాల్‌‌కు నో ప్లేస్‌‌

సైనా నెహ్వాల్‌‌కు నో ప్లేస్‌‌

న్యూఢిల్లీ:  ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌, ఏషియన్‌‌ గేమ్స్‌‌తో పాటు థామస్‌‌ అండ్‌‌ ఉబెర్‌‌ కప్‌‌ టోర్నమెంట్‌‌లో  పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌‌ సహా ఎనిమిది మంది తెలుగు షట్లర్లు బరిలో నిలిచారు. ఈ మూడు మెగా ఈవెంట్ల కోసం బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (బాయ్‌‌) గురువారం జట్లను ప్రకటించింది. వరల్డ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో టాప్‌‌15లో షట్లర్లకు నేరుగా బెర్తు లభించగా.. ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్‌‌ ట్రయల్స్‌‌లో సత్తా చాటిన ప్లేయర్లు ఈ జట్లకు ఎంపికయ్యారు. ర్యాంక్‌‌లో వెనుకబడటంతో పాటు ట్రయల్స్‌‌కు దూరమైన మరో సీనియర్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌ ఈ మూడు ఈవెంట్లకు దూరమైంది.  బర్మింగ్‌‌హామ్‌‌ ఆతిథ్యం ఇచ్చే కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ కోసం (జులై 28 నుంచి ఆగస్టు 8)  పది మంది షట్లర్ల ( ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు)తో  టీమ్‌‌ను బాయ్‌‌ ఎంపిక చేసింది.  చైనాలోని హాంగ్జౌలో జరిగే ఏషియన్‌‌ గేమ్స్‌‌ (సెప్టెంబర్‌‌ 10–-25)తో పాటు బ్యాంకాక్‌‌లో మే 8–15 మధ్య జరిగే థామస్‌‌–ఉబెర్‌‌ కప్‌‌ టోర్నీ కోసం ఉమ్మడిగా 20 మందితో టీమ్‌‌ను ప్రకటించింది.  సింధు, శ్రీకాంత్‌‌, సాత్విక్‌‌ సాయిరాజ్‌‌, పుల్లెల గాయత్రి మూడు ఈవెంట్లకు ఎంపికవగా.. సిక్కిరెడ్డి, విష్ణు వర్దన్‌‌ గౌడ్‌‌, కృష్ణప్రసాద్‌‌  ఏషియాడ్‌‌, థామస్‌‌ ఉబెర్‌‌ కప్‌‌ జట్లలో చోటు దక్కించుకున్నారు.  సుమీత్‌‌ రెడ్డి కామన్వెల్త్‌‌ టీమ్‌‌లో ఉన్నాడు.  కాగా, ఇండియా బ్యాడ్మింటన్‌‌ టీనేజ్‌‌ సెన్సేషన్‌‌ ఉన్నతి హుడా14 ఏళ్లకే  ఏషియన్‌‌ గేమ్స్‌‌కు ఎంపికైంది. ఈ మెగా ఈవెంట్‌‌లో పాల్గొనే యంగెస్ట్‌‌ షట్లర్‌‌గా ఉన్నతి నిలవనుంది.

సిక్కిరెడ్డికి గాయం..

సెలక్షన్​ ట్రయల్స్​ సందర్భంగా గాయపడ్డ సిక్కిరెడ్డి ఈ నెల 26 నుంచి జరిగే బ్యాడ్మింటన్​ ఆసియా చాంపియన్​షిప్స్​ తో పాటు థామస్​–ఉబెర్​ కప్​ నుంచి  వైదొలిగినట్టు గురువారం రాత్రి ట్వీట్​ చేసింది. 

కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ టీమ్​

మెన్స్‌‌: కిడాంబి శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌, సాత్విక్‌‌ సాయిరాజ్‌‌, చిరాగ్‌‌ షెట్టి, సుమీత్‌‌ రెడ్డి.విమెన్‌‌: పీవీ సింధు, ఆకర్షి కశ్యప్‌‌, ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప.
ఏషియన్‌‌ గేమ్స్‌‌, థామస్‌‌– ఉబెర్‌‌ కప్‌‌ టీమ్​ మెన్స్‌‌: కిడాంబి శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌, హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌, ప్రియాన్షు రావత్‌‌, చిరాగ్‌‌ షెట్టి, సాత్విక్‌‌, ధ్రువ్‌‌ కపిల, ఎంఆర్‌‌ ఆర్జున్‌‌, విష్ణు వర్దన్‌‌ గౌడ్‌‌, గరగా కృష్ణప్రసాద్‌‌.విమెన్స్‌‌: పీవీ సింధు, ఆకర్షి కశ్యప్‌‌, అష్మితా చాలిహా, ఉన్నతి హుడా, ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా.