సన్న వడ్లకు రూ.500  బోనస్‌‌

సన్న వడ్లకు రూ.500  బోనస్‌‌
  •  వచ్చే వానాకాలం సీజన్​ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
  • తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం
  • కాళేశ్వరం రిపేర్లపై ఎన్​డీఎస్ఏ సిఫార్సుల ప్రకారమే ముందుకెళ్తాం
  • రిపేర్​ చేస్తే బ్యారేజీ ఉంటదో? ఉండదో? చెప్పలేమని కమిటీ చెప్పింది
  • ఎన్​డీఎస్​ఏ చెప్పినట్టే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఓపెన్​ పెడ్తం 
  • తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని లిఫ్ట్ చేస్తం.. 
  • రిపేర్ల ఖర్చంతా నిర్మాణ సంస్థలదే
  • ‘అమ్మ ఆదర్శ పాఠశాల​’ కింద గవర్నమెంట్​ స్కూల్స్​లో మౌలిక వసతులకు రూ. 600 కోట్లు 
  • విద్య, ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్​ బాబు అధ్యక్షతన సబ్​ కమిటీ 
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీకి ఆహ్వానం.. ఉద్యమకారులకు సన్మానం 

హైదరాబాద్​, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్​ నుంచి సన్నవడ్లకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ ​నిర్ణయించింది. రాష్ట్రంలో  మిడ్​ డే మీల్స్, గురుకుల హాస్టల్స్, రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కోసం సన్నవడ్ల సాగును ప్రోత్సహించనున్నట్టు ప్రకటించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు  మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సెక్రటేరియెట్​లో సోమవారం మధ్యాహ్నం 3.25 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్​ భేటీ జరిగింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు మూడున్నర గంటలపాటు సమావేశం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర రికమండేషన్స్ ​రిపోర్ట్ పై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది.

ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి నిల్వ ఉంచబోమని స్పష్టం చేసింది. అయితే, కమిటీ సూచనలకు అనుగుణంగా రిపేర్లు చేస్తూ.. రైతుల కోసం రాక్​ ఫార్మేషన్​తో నీటిని లిఫ్ట్​​చేసే ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల ఏర్పాటును జూన్​ 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. విద్య, ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్​ బాబు అధ్యక్షతన కేబినెట్​ సబ్​కమిటీని ఏర్పాటు చేస్తూ  నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. ఆమెతో పాటు ఉద్యమకారులను కూడా పిలిచి పబ్లిక్​ మీటింగ్​లో సన్మానించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సమావేశ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, శ్రీధర్​ బాబు, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 

తడిసిన ధాన్యం మొత్తం కొంటాం: పొంగులేటి

యాసంగిలో రైతులు పండించిన 36 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకూ సివిల్​సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​సేకరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సేకరించిన ధాన్యానికి మూడు రోజులలోపే ప్రతి రైతుకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. 

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సివిల్​ సప్లయ్స్​ ద్వారా ఇంత అడ్వాన్స్​గా ధాన్యాన్ని సేకరించిన దాఖలాలు లేవని తెలిపారు. గత ప్రభుత్వం కూడా ఈ రకంగా వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టలేదని అన్నారు. తమది రైతుల, ప్రజా ప్రభుత్వమని, ధాన్యాన్ని వెంట వెంటనే సేకరించడమే కాకుండా అంతే స్పీడ్​గా ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.

గత 10  రోజులుగా ఎప్పుడూ లేనివిధంగా అకాల వర్షాలు కురుస్తున్నాయని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కొంత ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు కేబినెట్​ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు  కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ధాన్యం తడిసిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎంఎస్పీకి ఒక్క రూపాయి తగ్గకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. 

ఏయే సన్నవడ్లకు బోనస్​ ఇస్తామో వ్యవసాయ శాఖ చెప్తుంది 

రాబోయే సీజన్​లో ప్రతి ఏటా మిడ్​ డే మీల్స్, గురుకుల హాస్టల్స్​, రేషన్​ బియ్యం స్కీంకు 36 లక్షల మెట్రిక్​ టన్నులబియ్యం అవసరం ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ను వచ్చే ఖరీఫ్​ సీజన్​ నుంచి ఇస్తామని తెలిపారు.

ఆయా సన్నవడ్ల రకాలు ఏమిటనేది త్వరలోనే అగ్రికల్చర్​ డిపార్ట్ మెంట్​ ప్రకటిస్తుందని వెల్లడించారు. రైతులు ఇది గమనించాలని కోరారు. వానాకాలం సీజన్​కు సంబంధించి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు.  నకిలీ విత్తనాలు అమ్మి, నకిలీ రిసిప్ట్​లు ఇస్తున్నవారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కేబినెట్​ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. రైతులెవరూ లూజ్​ విత్తనాలు కొనొద్దని సూచించారు. ఎవరైనా అఫీషియల్ గా కొనాలని, పంట అయిపోయే వరకు ఆ రసీదులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు చేరవేయాలని కేబినెట్​లో నిర్ణయించినట్టు చెప్పారు.

కాళేశ్వరంపై ఎన్​డీఎస్​ఏ రిపోర్టుల ఆధారంగా ముందుకు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై  ఎన్​డీఎస్​ఏ  కమిటీ మధ్యంతర రిపోర్ట్ ఇచ్చిందని, మూడు బ్యారేజీల్లో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రమాదంలో ఉన్నాయని చెప్పిందని మంత్రి పొంగులేటి తెలిపారు.  ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని, గేట్లు ఓపెన్​ పెట్టాలని కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. తాము కమిటీ చెప్పినట్టే చేస్తామని తెలిపారు. రిపేర్​ చేసినంత మాత్రన బ్యారేజీ ఉంటదో? ఉండదో? చెప్పలేని పరిస్థితి ఉందని కూడా ఎన్​డీఎస్ఏ పేర్కొన్నదని చెప్పారు.

ఫిజికల్ గా, టెక్నికల్​గా ఎన్​డీఎస్ఏ అంశాల మీద ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెస్టులు పూర్తయ్యే వరకు ఎలాంటి పని చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ప్రాజెక్టుకు టెస్ట్​లు చేయించాలని నిర్ణయించామని, ప్రతి బ్యారేజ్​కు రెండు కంపెనీల నుంచి టెస్టులు చేయించి.. ఆ రిపోర్ట్స్​ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు.

వాటర్​ను స్టోర్ చేయకుండా.. గ్యాబెయిన్​బాక్స్​లు, రాక్​ఫార్మేషన్​ వంటి ఇతరత్రా నామినల్​ ఖర్చుతో వాటర్​ లిఫ్ట్​ చేసే అవకాశం ఉంటే దాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని కేబినెట్​ ఆదేశించిందని అన్నారు. రైతులకు నష్టం కలగకుండా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్ ప్రకారం  వాటర్​ లిఫ్ట్​ చేసే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రివర్గ సమావేశం సూచించిందని అన్నారు.

గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు వృథా పోకుండా ఉండేందుకు టెంపరరీ అరెంజ్​మెంట్స్​ అయినా చేసి రైతులకు నీరు ఇవ్వడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ఖర్చు నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్​ పార్టే..

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీ,  సోనియా గాంధీ అని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చే జూన్​ 2 నాటికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్నదని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే వేడుకలకు కాంగ్రెస్​ అగ్రనేత  సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్​లో ఒక ప్రతిపాదన చేశారని చెప్పారు.

పబ్లిక్​ మీటింగ్​ ఏర్పాటు చేసి, సోనియాతోపాటు రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారందరినీ సన్మానించాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీనికి ఈసీ అనుమతి తీసుకుంటామని చెప్పారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని, ప్రజల కోసమే పనిచేస్తామని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నదని, అదంతా అబద్ధమేనని చెప్పారు.

జూన్​ 12లోగా పాఠశాలల్లో పనులు పూర్తి

విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని పొంగులేటి స్పష్టం చేశారు. జూన్​ 12 లోగా ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమం కింద  ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందు కోసం రూ.600 కోట్లు కేటాయించగా.. రూ.120 కోట్లు అడ్వాన్స్​గా ఇచ్చినట్టు తెలిపారు. హెడ్​మాస్టర్ల ఆధ్వర్యంలో ఉండే కమిటీలు ప్రభుత్వ పాఠశాలల్లో  పనులు పూర్తి చేస్తాయని వివరించారు.

పాఠశాలల్లో సదుపాయాల కోసం కేబినెట్ సబ్​ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్​గా ఉంటారని తెలిపారు. గత సర్కార్​హయాంలో 5,600 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. గవర్నమెంట్​ స్కూల్​విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేస్తామని తెలిపారు. జూన్​ 6వ తేదీలోపు మొదటి డ్రెస్​, 12లోపు మరొక డ్రెస్​ పంపిణీ చేస్తామని వివరించారు.

మా ప్రాధాన్యం వ్యవసాయం, విద్య, హామీలే: శ్రీధర్​బాబు

 తమ ప్రభుత్వానికి వ్యవసాయం, విద్యతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలే ప్రాధాన్యమని మంత్రి శ్రీధర్​ బాబు స్పష్టం చేశారు. విద్యకు పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. విద్యలో మార్పు చూపించాలని, గత పదేండ్లు విద్యార్థులు, నిరుద్యోగులు ఏం నష్టపోయారో అది రిపీట్​ కాకుండా చూసుకోవాలని చర్చించినట్టు తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలని డెసిషన్​ తీసుకున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో గొప్ప మానవ వనరులను రెడీ చేసేలా ముందుకు వెళ్తామని అన్నారు. అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్​ ఉండేలా చూస్తామని చెప్పారు.  ప్రైవేట్​ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. గ్రామాల్లో ఉండే మహిళా గ్రూప్​లతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు.  రేషనలైజేషన్​ పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువును దూరం చేసిందని శ్రీధర్​ బాబు అన్నారు.

ఎక్కడైతే పిల్లలు చదువుకోవాలని స్కూళ్లకు వస్తారో అక్కడ పాఠశాలలను పున: ప్రారంభిస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్​ను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానిస్తారా? అని మీడియా అడగగా తమకు ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు. ధాన్యం విషయంలో గింజ తరుగు తీసేసినా చర్యలు తీసుకుంటామని అన్నారు. 2019 లోనే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి వైఫల్యాలు మొదలయ్యాయని, దాంతోనే ఇప్పుడు పిల్లర్లు కుంగిపోయాయని ఎన్​డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్​ ఇచ్చిందని తెలిపారు.

 డ్యామ్ సేఫ్టీ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, కేంద్రంతోనూ మాట్లాడుతున్నామని చెప్పారు.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సాంకేతిక నిపుణులు ఏం చెబితే అదే రకంగా ముందుకు వెళ్లాలని కేబినెట్​లో నిర్ణయించామని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కావొద్దనేది తమ ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్​బాబు పేర్కొన్నారు.  

రైతుల విషయంలో నాటకాలాడితే ఊరుకోం: మంత్రి వెంకట్​ రెడ్డి

దేశంలో రైతులపై  ఏ ప్రభుత్వానికి ప్రేమ ఉందో అందరికీ తెలుసునని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత కరెంట్​ను మొదలుపెట్టిందే తమ కాంగ్రెస్​ ప్రభుత్వమని చెప్పారు. రైతుల విషయంలో ఎవరైనా నాటకాలాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.   తన జిల్లాల్లో 99 శాతం పైన ధాన్యం సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మిగిలిపోయిన ధాన్యం సేకరణను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఆగస్టు15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.