త్వరలోనే ముంబయికి ఏక్ నాథ్ షిండే

త్వరలోనే ముంబయికి ఏక్ నాథ్ షిండే

తామే అసలైన శివసేన వారసులమని.. శివసేన ఎప్పటికీ మాదేనని రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసి.. రెబల్ ఎమ్మెల్యేలతో గౌహతిలోని ఓ హోటల్ లో మకాం వేసిన సంగతి తెలిసిందే. క్రమక్రమంగా షిండే వర్గంలో చేరుతున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. లెటెస్ట్ గా గౌహతిలోని రాడిసన్ హోటల్ నుంచి బయటకు వచ్చిన షిండే మీడియాతో మాట్లాడారు. బాల్ థాక్రే హిందుత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. తామంతా కలిసి త్వరలో ముంబాయికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తమ యాక్షన్ ప్లాన్ చెప్తామని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఏక్ నాథ్ షిండే.. ముంబాయికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గౌహతి నుంచి ముంబాయికి వెళ్లి.. గవర్నర్ ను కలువనున్నారని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరనున్నారు. షిండే వర్గం బల పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెబుతోంది షిండే వర్గం. బల నిరూపణ కోసం ఏక్ నాథ్ షిండే గవర్నర్ కు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నోటీసులపై జులై 12 వరకు స్టే విధించింది. దీనిపై సంజయ్ రౌత్ స్పందించారు. రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పట్లో పని లేదని అన్నారు. జులై 11 వరకు విశ్రాంతి తీసుకోవచ్చని కామెంట్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.