రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
  • కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఈనెల 30లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరిన ఈసీ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. త్వరలో 5 రాష్ట్రాల్లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగాల్సిన నేపధ్యంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని కోరుతూ లేఖ రాసింది. ఈ నెల 30లోపుగా మీ అభిప్రాయాలు తెలపాలని కోరింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా.. ? లేదా.. ? అన్న అనుమానాలు.. చర్చలు జరుగుతున్న నేపధ్యంలో ఈసీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో ఎన్నికలు నిర్వహించిన తమిళనాడు ఎన్నికల సంఘానికి మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఎన్నికల కోసం తొందరపడ్డారని తీవ్ర అసహనం.. ఆగ్రహాన్ని తమిళనాడు ఎన్నికల సంఘం ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో త్వరలో ఎన్నికలు జరగాల్సిన ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో పరిస్థితులపై ఆరా తీస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు కూడా లేఖలు పంపింది. 
రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి తప్పించడంతో టీఆర్ఎస్ పార్టీతోపాటు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామమా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా బద్వేలు లో సిట్టింగ్ ఎమ్మెల్, వైసీపీ నేత డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల్లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు.. ఉప ఎన్నికల నిర్వహణ నేపధ్యంలో కోవిడ్ పరిస్థితులపై రాజకీయ పార్టీలు అభిప్రాయం తెలపాలని ఈసీ కోరింది.