హైదరాబాద్: క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని సోమవారం (మార్చి 30) ఆయా జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది. 2026, ఏప్రిల్ 4న మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది.
కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2026, ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2026, ఫిబ్రవరి 13న ఫలితాలు విడుదల అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. అయితే.. క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మూడు మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
