బోసిపోతున్న మినిస్టర్ల ఆఫీసులు.. ఆగిన కీలక ఫైళ్లు

బోసిపోతున్న మినిస్టర్ల ఆఫీసులు.. ఆగిన కీలక ఫైళ్లు
  • నవంబర్​ 3 దాకా అంతా మునుగోడులోనే
  • ఒక్కరోజు ప్రచారానికి డుమ్మాకొట్టినా హైకమాండ్​ గరం
  • ఎప్పటికప్పుడు రిపోర్టు తెప్పించుకుంటున్న ప్రగతిభవన్
  • ప్రచార ఖర్చంతా ఎమ్మెల్యేలపైనే.. తలలు పట్టుకుంటున్న లీడర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిపాలన దాదాపు మూలకుపడ్డది. వచ్చే నెల మూడో  తారీఖున మునుగోడు ఉప ఎన్నిక ముగిసే దాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. టీఆర్ఎస్​ అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర మంత్రివర్గం మొత్తం మునుగోడు నియోజకవర్గానికి బయల్దేరి వెళ్లింది. మంత్రులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ పోలింగ్ వరకు అక్కడే గ్రామాల్లో మకాం పెడ్తున్నారు. మరోవైపు జాతీయ పార్టీ ఏర్పాటు పనులపై సీఎం కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లారు. ఆయన కూడా కొన్నిరోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ అందుబాటులో లేకపోవటంతో పరిపాలనా వ్యవహారాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌‌లోని మినిస్టర్ల ఆఫీసులు  బోసిపోయాయి. బీఆర్‌‌కే భవన్‌‌తో పాటు మినిస్టర్ల ఆఫీసుల్లో ఫైళ్లన్నీ పెండింగ్​లో పడ్డాయి. మంత్రులంతా బైపోల్‌‌ బాధ్యతల్లోనే బిజీగా ఉండటం, సీఎం నిత్యం మునుగోడు ఉప ఎన్నికతో పాటు బీఆర్​ఎస్​కు సంబంధించిన ప్రణాళికల్లో తలమునకలవడంతో పాలన పడకేసింది. వివిధ డిపార్ట్‌‌మెంట్ల సెక్రటరీలు సీఎంవోకు, మంత్రులకు పంపిన ఫైళ్లు ముందుకు కదుల్తలేవు. 

ఎమ్మెల్యేలు కూడా కళ్యాణలక్ష్మీ అప్లికేషన్లపై సంతకాలు పెట్టడం ఆపేశారు. ఏమైనా అంటే ‘టాస్క్​ మునుగోడు’ అంటున్నారు. క్యాంపెయిన్​ పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చెప్పొద్దని, సొంత నియోజకవర్గానికి సంబంధించినవి కూడా ఏమన్నా ఉంటే ‘తరువాతే చుద్దాం’ అని తమ జిల్లా కలెక్టర్లకు, లోకల్​లీడర్లకు, కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పష్టం చేస్తున్నారు.

గ్రూప్​- 4 ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎంవోలో పెండింగ్​

గ్రూప్​- 4 ఉద్యోగ నియామకాల అనుమతికి సంబంధించిన ఫైల్​ గత పది రోజులుగా సీఎంవోలో మూలుగుతున్నది. పోస్టుల ప్రక్రియను ఫైనాన్స్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తి చేసి సీఎంవోకు పంపింది. మొత్తం 9,360 గ్రూప్​- 4 పోస్టులకు ప్రభుత్వం నుంచి అప్రూవల్​ ఇవ్వాల్సి ఉంది. సీఎం ఓకే చెప్తే ఫైనాన్స్ అప్రూవల్​ఇస్తమని ఆఫీసర్లు అంటున్నారు. జిల్లా స్థాయి పోస్టులు కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

దళిత బంధుపై నో క్లారిటీ..

ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధు అమలుపై నెల కిందట కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్  ఫేజ్​లో ఒక్కో నియోజకవర్గంలో 500 మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు గైడ్​లైన్స్, నిధుల విడుదలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వానికి ఫైల్​ పంపారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికతో అసలు దీని గురించి ప్రస్తావన కూడా రావడం లేదు. సంబంధిత శాఖ మంత్రి మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం ఆఫీసులో ఏమైనా అడిగితే ‘ఆఫ్టర్​ ఎలక్షన్’​ అనే సమాధానం వస్తున్నదని అధికారులు అంటున్నారు. 

కల్యాణలక్ష్మి అప్లికేషన్లు పెండింగ్

కల్యాణలక్ష్మి స్కీమ్​ కింద లబ్ధి కోసం చేసుకున్న దరఖాస్తులన్నీ ఎమ్మెల్యేల అప్రూవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఇప్పటికే ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి చెక్కులు రెడీ చేసినా ఎమ్మెల్యేలంతా మునుగోడు ప్రచారంలో ఉండటంతో వాటి పంపిణీకి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయితే కానీ ఈ అప్లికేషన్ల ప్రక్రియ ముందుకు పడే పరిస్థితి లేకుండా పోయింది.

కామన్​ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుపై  గందరగోళం

రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. ఇంతవరకు వీసీని నియమించలేదు. దీనికి సంబంధించిన ఫైల్​ సర్కార్​ దగ్గరే పెండింగ్​లో ఉన్నది. వర్సిటీల్లో నియామకాలకు సంబంధించిన  కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు బిల్లుకు గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం లభించింది. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి క్లారిఫికేషన్​ ఫైల్​ ప్రభుత్వానికి వెళ్లింది. ఇంతవరకూ సర్కార్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మునుగోడు పేరు చెప్పి ఇంకో 20 రోజులు వాయిదా వేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.

వడ్ల కొనుగోళ్లపై తేలుస్తలే

ఈ ఏడాది వానాకాలం సీజన్​ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో వరికోతలు మొదలు కానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల ఏర్పాట్లపై రాష్ట్రాన్ని వివరాలు అడిగింది. గన్నీబ్యాగులు, కొనుగోలు కేంద్రాలు వంటి వాటిపై సీఎం, మంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. అయితే మంత్రికి విషయం తెలిసినప్పటికీ ఇంతవరకు ఏం చెప్పలేదని ఆఫీసర్లు అంటున్నారు. 

వేరే పార్టీలో ఒక్క సర్పంచ్‌‌, ఎంపీటీసీ కూడా ఉండొద్దు

మునుగోడు ఉప ఎన్నికలో ఎట్లయినా గెలిచి తీరాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు టీఆర్​ఎస్​ నాయకత్వం తేల్చిచెప్తున్నది. కాంగ్రెస్‌, బీజేపీకి నియోజకవర్గంలోని ఒక్క సర్పంచ్‌, ఎంపీటీసీ స్థాయి ప్రజాప్రతినిధి కూడా మిగలొద్దని, ఆ రెండు పార్టీల్లోని లీడర్లను నయానో భయానో టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. టీఆర్​ఎస్​ను వీడిన వాళ్లపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని, వారిని రప్పించేందుకు మరింత చొరవ చూపాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను తమ దగ్గరికి పిలిపించుకొని బైపోల్​లో టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తే ఇంత మొత్తం సర్దుబాటు చేస్తామని ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ప్రజాప్రతినిధులను పార్టీలోకి తెచ్చేందుకు అయ్యే ఖర్చును తాము చూసుకుంటామని, క్యాంపెయినింగ్‌తో పాటు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సంబంధించిన వ్యవహారాలను ఇన్‌చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలే పెట్టుకోవాలని హైకమాండ్​ ఆదేశించినట్లు లీడర్లు అంటున్నారు. చేరికలపై రోజువారీగా రిపోర్టును పార్టీ నాయకత్వం తెప్పించుకుంటున్నది. బైపోల్‌ ప్రచారాన్ని ప్రత్యక్షంగా ఎలా డ్రైవ్‌ చేయాలి..? సోషల్‌ మీడియాలో ఏ అంశాలను హైలైట్‌ చేయాలనే దానిపైనా ఎప్పటికప్పుడు గైడ్‌ చేస్తున్నది.

ప్రచారానికి ఎందుకు పోలే.. తరుముతున్న హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగితేలాలని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హైకమాండ్​ నుంచి వస్తున్న ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి ఊరికో ఎమ్మెల్యే, రెండూళ్లకో మంత్రిని సీఎం కేసీఆర్​రంగంలోకి దింపారు. పొద్దంతా ఇంటింటి ప్రచారం చేపట్టాలని, ప్రతి ఓటరును కలుసుకోవాలని బాధ్యతలు అప్పగించారు. ఇందుకయ్యే ఖర్చులను కూడా ఎమ్మెల్యేలు, సంబంధిత ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులే భరించాలని హైకమాండ్​ నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హైరానా పడుతున్నారు. ఇప్పటికే 84 మంది ఎమ్మెల్యేలు కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెళ్లి మునుగోడులో అడ్డా వేశారు. ఒక రోజు ప్రచారంలో కనిపించకపోయినా, నేరుగా ప్రగతిభవన్ నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఒక మంత్రి వరుసగా రెండు రోజులు తనకు అప్పగించిన ఊర్లకు వెళ్లలేదు. ఈ విషయాన్ని టీఆర్​ఎస్​ హైకమాండ్​ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవటంతో పాటు.. వెంటనే మంత్రికి ఫోన్​ చేసి మందలించినట్లు తెలిసింది. వరంగల్ ఉమ్మడి​జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అమెరికా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో ప్రచారానికి దూరమయ్యారు. ప్రగతిభవన్​ ఆదేశాలతో మునుగోడు నియోజకవర్గంలోని తనకు కేటాయించిన గ్రామానికి తన కేడర్​ను పంపించారు. అక్కడి మందు, విందు ఖర్చులను చూసి బెంబేలెత్తిన ఆయన అనుచరులు ఒక్కరోజుకే అక్కడి నుంచి బిచాణా ఎత్తేశారు. ఆ విషయాన్ని పార్టీ నాయకత్వం ఆరా తీయటంతో విదేశాల్లో ఉన్న ఆ ఎమ్మెల్యేకు ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ప్రచారంపై నిత్యం పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరా తీస్తుండటం, అందుబాటులో లేనివారికి క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు పేరెత్తితేనే హైరానా పడుతున్నారు.