ఈఎస్​ఐ ఆరోగ్య బీమా ఇక దేశవ్యాప్తం

ఈఎస్​ఐ ఆరోగ్య బీమా  ఇక దేశవ్యాప్తం

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్​ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్​ఐసీ)  తన ఆరోగ్య బీమా స్కీము ఈఎస్​ఐని ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఎంప్లాయీస్​ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్​ఐ) స్కీము 443 జిల్లాల్లో పూర్తిగా,  153 జిల్లాల్లో పాక్షికంగా అమలు అవుతోంది. మిగతా148 జిల్లాలు ఈఎస్‌‌‌‌ఐ స్కీము పరిధిలోకి రావడం లేదు. ఇక నుంచి అన్ని జిల్లాల్లో ఈఎస్​ఐని అమలు చేయాలని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన 188 వ సమావేశంలో నిర్ణయించారు.

ఎంఐఎపీ (మోడిఫైడ్ ఇన్సూరెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్),  ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)  టై -అప్ ఆసుపత్రులను ఎంపానెల్ చేయడం చేసి కొత్త డీసీబీఓలను (డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ కార్యాలయాలు) ఏర్పాటు చేయడం ద్వారా వైద్యసేవలను అందిస్తారు.అంతేకాకుండా, దేశవ్యాప్తంగా 23 కొత్త 100 బెడ్స్​ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఈఎస్​ఐసీ నిర్ణయించింది. వీటిలో మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు), ఛత్తీస్‌‌గఢ్ (బిలాస్‌‌పూర్), గోవా (ముల్గావ్), గుజరాత్ (సనద్), మధ్యప్రదేశ్ (జబల్‌‌పూర్), ఒడిశా (ఝార్సుగూడ), పశ్చిమ బెంగాల్ (ఖరగ్‌‌పూర్)లలో నిర్మిస్తారు. ఈ ఆసుపత్రులతో పాటు 62 చోట్ల ఐదు డిస్పెన్సరీలను కూడా ప్రారంభించనున్నారు.

మహారాష్ట్రలో 48 డిస్పెన్సరీలు, ఢిల్లీలో 12 డిస్పెన్సరీలు  హర్యానాలో 2 డిస్పెన్సరీలను తెరుస్తారు.  బీమా ఉన్న కార్మికులు  వారిపై ఆధారపడిన వారికి ఇవి క్వాలిటీ ట్రీట్​మెంట్లను అందిస్తాయి.  157 జిల్లాల్లో ఈఎస్‌‌ఐ స్కీము లబ్ధిదారులు ఇప్పటికే  టై-అప్​ల వల్ల క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్లను పొందుతున్నారు.  తెలంగాణలోని సనత్‌‌నగర్,  రాజస్థాన్‌‌లోని అల్వార్‌‌లోని ఈఎస్​ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌‌లో రెండు క్యాథ్ ల్యాబ్‌‌లు ఏర్పాటు చేస్తారు.