ఎగ్జిట్ పోల్స్ తారుమారైతే కేంద్రానికి వీళ్లు కీలకం!

ఎగ్జిట్ పోల్స్ తారుమారైతే కేంద్రానికి వీళ్లు కీలకం!
  • బీజేపీని వ్యతిరేకిస్తున్న టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ చీఫ్లు
  • తటస్థంగా టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ చీఫ్లు..
  • ఇప్పటికే కాంగ్రెస్తో డీఎంకే పొత్తు
  • ఎగ్జిట్ పోల్స్కు రియల్ రిజల్ట్స్కు తేడా వస్తే ఎవరు ఎటువైపో?

ఎన్నికల్లో వ్యతిరేకించినా.. సర్కార్​లో కలిసిపోయే చాన్స్?  న్యూఢిల్లీ: దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ మళ్లీ ఎన్డీయేదే అధికారమని చెప్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అవన్నీ రాంగ్ అని కొట్టిపారేస్తున్నాయి. ఏం జరుగనుం దో.. ఎవరు కింగ్ కానున్నారో.. మరో 24 గంటల్లో తేలిపోనుం ది. అయితే.. ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ తిరగబడితే..?  న్డీయేకు కానీ, యూపీఏకు కానీ మెజారిటీ రాకుండా కేంద్రంలో హంగ్ వస్తే.. పరిస్థితి ఏమిటి?! అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు ఏడుగురు నేతల మద్దతు కీలకం కానుం ది. కేంద్రంలో ఎన్డీయే కానీ, యూపీఏ కానీ అధికారాన్ని చేపట్టాలన్నా.. లేదా ప్రాంతీయ పార్టీలన్నీకలిసి కూటమిగా పవర్​లోకి రావాలన్నా.. టీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్, వైఎస్సార్​సీపీ చీఫ్​ జగన్, డీఎంకే చీఫ్​ స్టాలిన్​, బీఎస్పీ చీఫ్​ మాయావతి, ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​, టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ, బీజేడీ చీఫ్​ నవీన్​ పట్నాయక్​ మద్దతు తప్పనిసరి కానుంది. స్టాలిన్​ ఇప్పటికే తన రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్​తో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్​లో మాయావతి, అఖిలేశ్​ పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. మొదటి నుంచి మమతా బెనర్జీ బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేసీఆర్​, జగన్​, నవీన్​ పట్నాయక్​ తటస్థంగా ఉన్నారు.

టచ్​లో రెండు కూటములు

ఈ ఏడు పార్టీలకు మంచి ఫలితాలు వస్తాయని ప్రీ పోల్​ సర్వేలు అంచనా వేశాయి. తాజాగా ఎగ్జిట్​ పోల్స్​ కూడా అటూ ఇటూగా అదే రీతిలో  అంచనా వేశాయి. దీంతో ఏడుగురు కింగ్​ మేకర్స్​పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అన్ని పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్తున్న కాంగ్రెస్​.. మొదటి నుంచి టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీతో మంతనాలు జరుపుతూనే ఉంది. ఎస్పీ, బీఎస్పీ చీఫ్​లు కూడా తమకే మద్దతిస్తారని విశ్వసిస్తోంది. ఆ ముగ్గురితో గత ఐదురోజులుగా టీడీపీ చీఫ్​ చంద్రబాబు మంతనాలు కొనసాగిస్తున్నారు. వాళ్ల డిమాండ్లను తెలుసుకుంటూ.. వాళ్లతో జరిపిన చర్చల సారాంశాన్ని కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీకి, యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ దృష్టికి తెస్తున్నారు. ఈ ముగ్గురూ బీజేపీకి దూరం పాటిస్తున్నవారే కావడంతో కాంగ్రెస్​ గంపెడాశలు పెట్టుకుంది. ఇక, తమిళనాడులోని డీఎంకే పార్టీ చీఫ్​ స్టాలిన్​ కాంగ్రెస్​కే మద్దతిస్తామని ప్రకటించారు. కానీ.. స్టాలిన్​ తమతో టచ్​లో ఉన్నారని ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్​ చెప్పడం చర్చనీయాంశమైంది. తమిళనాడులో కాంగ్రెస్​తో పొత్తుపెట్టుకొని డీఎంకే బరిలోకి దిగినప్పటికీ.. హంగ్​వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

బీజేడీ చీఫ్​ నవీన్​ పట్నాయక్, వైఎస్సార్​సీపీ చీఫ్​ జగన్​తో కాంగ్రెస్​ దూతలు, బీజేపీ దూతలు టచ్​లో ఉంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. యూపీఏ భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ స్వయంగా జగన్​కు ఫోన్​ చేసి, యూపీఏకు మద్దతు కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే జగన్​ మాత్రం ఫలితాలు వచ్చే వరకు వేచి చూద్దామని అన్నట్లు తెలుస్తోంది. పైగా ఏపీలో తమ ప్రత్యర్థి చంద్రబాబు యూపీఏలో ఉన్నందున ఆ కూటమికి ఆయన దూరం పాటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎగ్జిట్​ పోల్స్​ తమకే అనుకూలంగా ఉన్నా.. అవి తప్పితే ఏం చేయాలన్న దానిపై బీజేపీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.

‘‘ఏపీలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్​ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రత్యర్థి కేసీఆర్​ ఉన్నారు. అలానే ఒడిశాలో నవీన్​ పట్నాయక్​ ఉన్నారు. వారితో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు. వాళ్లందరూ మాతో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీయేదే అధికారం” అని బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా చీఫ్​ రాందాస్​ అథావలె మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ‘‘కేంద్రంలో ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో దానికి మద్దతు తెలుపుతాం. ఒడిశా ప్రయోజనాలు ముఖ్యం” అని బీజేడీ అధికార ప్రతినిధి అమర్​ పట్నాయక్​ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఈ సారి కేంద్రంలో భాగస్వామ్యం కావడానికి బీజేడీ ఓకే చెప్పినట్లయింది.

మాయావతి

బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఈ ఎన్నికల్లో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఉత్తరప్రదేశ్​లో పోటీచేశారు. మోడీ వ్యతిరేక ఫ్రంట్‌కు ఆమె మద్దతిచ్చే అవకాశముంది. అయితే.. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఆ ఫ్రంట్​సమావేశాలకు వస్తానంటూ మాయావతి ప్రతిపాదన చేసినట్లు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ  నేపథ్యంలోనే ఆదివారం సోనియాతో సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటును గెలువలేకపోయింది. ఈ సారి కూటమిగా ఏర్పడినందున మంచి ఫలితాలు వస్తాయని మాయావతి భావిస్తున్నారు. కూటమికి 60 సీట్ల వరకు రావొచ్చని, అందుకే ప్రధాని అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని ఆమె పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎగ్జిట్​ పోల్స్​ మాత్రం కూటమికి 20 నుంచి 45  సీట్లు రావొచ్చని అంచనా వేశాయి.

అఖిలేశ్‌ యాదవ్‌

అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి లోక్‌సభలో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. తమ సొంత రాష్ట్రం యూపీలో బీఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడంతో ఈ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. మోడీ వ్యతిరేక పార్టీలతో అఖిలేశ్‌ చేతులు కలిపే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ చీఫ్​ చంద్రబాబు ఇటీవల అఖిలేశ్​ను కలిసి చర్చలు కూడా సాగించారు.

మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలో నాన్‌ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపోత్ర పోషించే అవకాశముంది. మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ నేతల్లో ఆమె ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా తృణమూల్‌ ఉంది. రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లు ఉండగా.. 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు 33 సీట్లు వచ్చాయి. ఈసారి 24 నుంచి 29 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. మోడీని వ్యతిరేకిస్తున్న మమత ముమ్మాటికీ తమకే మద్దతు తెలుపుతారని కాంగ్రెస్​ ఆశతో ఉంది.

ఎం.కె.స్టాలిన్‌

తమిళనాడుకు చెందిన డీఎంకే చీఫ్‌ ఎం.కె. స్టాలిన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ పేరును ప్రధాని పదవికి బహిరంగంగానే ప్రతిపాదించారు. రాష్ట్రంలో 39 ఎంపీ సీట్లు ఉండగా ఈ సారి 38 సీట్లకే ఎన్నికలు జరిగాయి. డీఎంకే, కాంగ్రెస్​ కలిసి పోటీ చేయడంతో ఆ కూటమికి 27 నుంచి 34  సీట్లు రావొచ్చని ఎగ్జిట్​ పోల్స్​ పేర్కొన్నాయి. ఎన్డీయే,  యూపీఏకు  సరిపడా సీట్లు రాకపోతే.. స్టాలిన్​ మద్దతు కీలకం. కాంగ్రెస్​తో కలిసి ఉన్నామని ఆయన చెప్తున్నా, ఎగ్జిట్​పోల్స్​ తర్వాత స్టాలిన్​ తీరులో మార్పు వచ్చిందని, ఆయన తమవైపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు. వీటిని డీఎంకే నేతలు కొట్టిపారేస్తున్నారు.

కె.చంద్రశేఖర్‌రావు

తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ కేంద్రంలో నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు  ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్​ ఫ్రంట్​ కోసం ఆయన కృషి చేస్తున్నారు. డీఎంకే చీఫ్​ స్టాలిన్​, జేడీఎస్​ చీఫ్​ కుమారస్వామి, బీజేడీ చీఫ్​ నవీన్​ పట్నాయక్​, టీఎంసీ చీఫ్​ మమతను పలు దఫాలుగా కలిసి చర్చించారు. వైఎస్​ జగన్ తమ వెంట వస్తారని టీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో 2014లో టీఆర్​ఎస్​ 11 గెలిచింది. ఆ పార్టీ ఈసారి 13 సీట్లు గెలుచుకునే అవకాశమున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టంచేశాయి.

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని వైఎస్‌ జగన్మోహన్‌  రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్​సీపీకి  తెలుగుదేశాని కన్నా  ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేయడంతో బీజేపీ, కాంగ్రెస్‌ ఆయన మద్దతుకోసం ప్రయత్నాలు  ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ఢిల్లీలో జరగబోయే ప్రతిపక్షాల మీటింగ్‌కు హాజరుకావాలని కాంగ్రెస్‌ ఆయనను ఆహ్వానించినట్టు నేషనల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. జగన్‌ మొదట్నుంచి డిమాండ్‌ చేస్తున్నట్టు ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు బీజేపీ  క్లారిటీ ఇచ్చిందని సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో వైఎస్సార్​సీసీ 20 సీట్లను గెలుచుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌  అంచనా వేశాయి.

నవీన్‌ పట్నాయక్‌

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ సీట్లున్నాయి. సీఎం నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ 2014 ఎన్నికల్లో  15 సీట్లు గెలుచుకొని లోక్‌సభలో ఐదో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజా ఎన్నికల్లోనూ నవీన్‌ పార్టీకి రెండు నుంచి 15  వరకు ఎంపీ సీట్లు రావొచ్చని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. ఒడిశాలో లోక్​సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలూ జరిగాయి. తిరిగి నవీన్ పట్నాయక్​ సీఎం అవుతారని అంచనా వేశాయి. ఇటీవల వచ్చిన ఫొని తుపాన్‌ సందర్భంగా  పట్నాయక్‌  సర్కార్‌ సేవల్ని ప్రధాని మెచ్చుకున్నారు. ఐదేళ్లుగా పార్లమెంట్‌లో బీజేపీ సర్కార్​కు నవీన్‌ ఎన్నోసార్లు సాయపడ్డారు.