రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా: గవర్నర్ తమిళిసై

రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్/మాదాపూర్, వెలుగు:  రాష్ట్రంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. రెండేండ్ల నుంచి హెల్త్ డిపార్ట్​మెంట్ అధికారులు నాకు అందుబాటులో ఉండటం లేదు. ఇబ్బందులను అవకాశంగా మలుచుకోవడమే నాకున్న బలం. ఆ బలంతోనే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నా” అని గవర్నర్ తమిళిసై అన్నారు. ఆదివారం హైదరాబాద్​లో కిమ్స్ కడిల్స్​ నిర్వహించిన ‘‘విమెన్స్ హెల్త్ కాన్​క్లేవ్ 2023’’ సదస్సుకు గవర్నర్ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వర్క్​లైఫ్ బ్యాలెన్స్, పని ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలని పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ‘‘రాష్ట్రానికి గవర్నర్​గా బాధ్యతలు నిర్వహించాలంటే ఫస్ట్ నేను మానసికంగా బలంగా ఉండాలి. అప్పుడే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాటుకుని ముందుకెళ్లగల్గుతాను. నేనొక డాక్టరే అయినా.. తెలంగాణ సోదరిని. బాధ్యతలను ఒత్తిడితో చూడొద్దు. చేసే పనిని ఆస్వాదించాలి”అని తమిళిసై సూచించారు. 

లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలి

వర్క్​ని ప్రేమిస్తే ఒత్తిడి అనే భావనే రాదని గవర్నర్ తమిళిసై అన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి మహిళా ముందుకు రావాలని సూచించారు. సేవ ఎక్కడుంటే తానూ అక్కడే ఉంటానని చెప్పారు. లైంగిక వేధింపులపై ఆడ పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మెరుగైన దేశ నిర్మాణానికి మహిళల ఆరోగ్యం కూడా చాలా కీలకమన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. ప్రస్తుతం సగానికిపైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారికి పోషక ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ‌‌హిళ‌‌ల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న కిమ్స్ క‌‌డ‌‌ల్స్ హాస్పిటల్ క్లినిక‌‌ల్ డైరెక్టర్ డాక్టర్ శిల్పిరెడ్డి గవర్నర్ అభినందించారు.

ఆయుష్మాన్ భారత్​ను అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్​ను రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేయాలని తమిళిసై సూచించారు. రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు చేస్తే ఎంతో మంది పేదలకు మేలు కలుగుతుందన్నారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరమని పేర్కొన్నారు. మంచి ఆరోగ్యం కోసం రోజూ యోగా చేయాలని సూచించారు. చాలా మంది టైం లేదన్న కారణంతో యోగాను విస్మరిస్తున్నారన్నారు.

ప్రతి ఒక్కరూ యోగా కోసం టైం కేటాయించాలని తెలిపారు. స్టూడెంట్స్ తమ టైం టేబుల్​ మార్చుకోవాలన్నారు. ఫిజికల్ ఫిట్​నెస్​తో పాటు మెంటల్ ఫిట్​నెస్​ కూడా ముఖ్యమని సూచించారు. జనరిక్​ మెడికల్ షాపుల్లో మందులు తక్కువ ధరకు దొరుకుతున్నాయన్నారు. కరోనా సమయంలో రెడ్​ క్రాస్​ సొసైటీ తనకు ఎంతో సాయం చేసిందని గుర్తుచేశారు. ఈ సదస్సులో కిమ్స్ గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రావు, కిమ్స్ ఆప‌‌రేష‌‌న్స్ హెడ్ అనిత‌‌ తదితరులు పాల్గొన్నారు.