చండూరు : రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీపై అసత్య ఆరోపణలు చేసి ఓట్లు వేయించుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీకి ఓట్లు వేస్తే రైతుబంధు, పెన్షన్లు రావని, బాయికాడ మోటార్లకు మీటర్లు పెడతారని సీఎం అబద్ధాలు చెప్పాడని కానీ ఏం జరిగిందో జనాలకు తెలుసన్నారు. ఆదివారం మునుగోడు లో నిర్వహించే సమరభేరి మీటింగ్ కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి ఆరోపించినట్టుగా బీజేపీ గెలిచిన హుజూరాబాద్ దుబ్బాకలో రైతుబంధు, పెన్షన్లు ఆగినయా? కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టిందా చూపాలి అని సవాల్ విసిరారు.
ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి, బీజేపీపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తారని సీఎం భ్రమలో ఉన్నారన్నారు. కేసీఆర్ గురించి ప్రజలకు మొత్తం తెలిసిపోయిందన్నారు. నిరుద్యోగ భృతి లేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదన్నారు. వాసాలమర్రికి, చింతమడకలకు రూ.10 లక్షలు ప్రకటించిన సీఎంను తమ నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. మునుగోడు నుంచే సీఎం పతనం ప్రారంభమవుతుందన్నారు. మునుగోడు ప్రజల తీర్పు తెలంగాణలో మార్పుగా చరిత్ర సృష్టిస్తోందన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

