పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ట్రంప్ మధ్యవర్తిత్వంలో వాషింగ్టన్ లో జరిగిన ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులతో సమావేశంలో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇజ్రాయెల్ ,లెబనాన్ మధ్య దశాబ్దాలతర్వాత మొదటి ప్రత్యక్ష దౌత్య చర్చలు ఇవి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి యుద్దం కొనసాగిస్తున్న ఈ పొరుగు దేశాలకు ఇది కీలక ముందడుగు. తొలుత కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ సోమవారంతో ముగియనుంది.
గురువారం వైట్ హౌస్‌లో జరిగిన చర్చల అనంతరం కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.హిజ్బుల్లా నుంచి తనను తాను రక్షించుకునేందుకు లెబనాన్‌కు సాయం చేసేందుకు యూఎస్ కలిసి పనిచేస్తుందని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. రాబోయే రెండు వారాల్లో వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ,లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌లతో సమావేశం కానున్నట్లు తెలిపారు ట్రంప్.

