- సోషల్ మీడియాలో జాత్యహంకార పోస్ట్‌కు ట్రంప్ మద్దతు
- భారత్, చైనా నాగరికతలకు పుట్టినిళ్లు: ఇరాన్ కౌంటర్
- నాగరికతలను తుడిచిపెట్టేస్తానన్న అధ్యక్షుడిదే అసలైన నరకమని ఫైర్
- మేమూ కొన్ని వార్తలను చూశాం: కేంద్రం
- విమర్శలు వెల్లువెత్తడంతో భారత్ గొప్ప దేశమంటూ మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ సోషల్ మీడియాలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలకడం వివాదాస్పదమైంది. మైఖేల్ ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..భారత్, చైనా వంటి పలు దేశాలను నరకంతో పోల్చాడు. ఆయా దేశాలకు చెందిన గర్భిణులు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి పిల్లలను కంటారని.. తద్వారా యూఎస్ సిటిజన్‌షిప్ పొందుతున్నారని ఆరోపించాడు. దీనివల్ల దేశ గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఫైర్ అయ్యాడు. అమెరికన్ల ఉద్యోగాలను ఇండియన్లు, చైనీయులు కొల్లగొడుతున్నారని.. వాళ్లు ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లని మండిపడ్డాడు. స్థానిక వ్యవస్థలను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని అక్కసు వెళ్లగక్కాడు. అయితే, మైఖేల్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, ట్రాన్స్‌క్రిప్ట్ (లెటర్)లను సమర్థిస్తూ వాటిని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేస్తూ ట్రంప్ ఇప్పటికే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ప్రస్తుతం ఈ అంశం అక్కడి సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. భారత్, చైనా సహా ప్రపంచంలోని ఇతర దేశాలేవీ బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ఇవ్వడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ, కెనడా, మెక్సికో సహా 30కి పైగా దేశాల్లో ఈ విధానం ఉంది. కాగా, ట్రంప్ చేసిన అవమానకరమైన పోస్ట్‌పై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. " జాత్యహంకార వ్యాఖ్యలకు ట్రంప్ మద్దతుకు సంబంధించి మేమూ కొన్ని వార్తలను చూశాం. ఆ విషయంపై నేను అంతవరకే చెప్పదలచుకున్నాను" అని పేర్కొంటూ డిప్లొమాటిక్ గా సమాధానం ఇచ్చారు.
అమెరికా చరిత్ర 250 ఏండ్లే: ఇరాన్
మైఖేల్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలకు ట్రంప్ మద్దతు పలకడంపై హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఘాటుగా స్పందించింది. "భారత్, చైనా నాగరికతలకు పుట్టిన ఇళ్ల వంటివి. నిజానికి, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానని ఏ దేశ అధ్యక్షుడైతే బెదిరించాడో అతను ఉన్న ప్రదేశమే అసలైన నరకం" అని కౌంటర్ ఇచ్చింది. భారత, చైనా నాగరికతలు ప్రపంచంలోనే పురాతనమైనవి. 4 వేల ఏండ్లనాటి చరిత్ర, సంస్కృతి వీటి సొంతం. అలాగే ఇరాన్ నాగరికత (పర్షియా) కూడా పురాతనమైనదే. ఇక అమెరికా విషయానికొస్తే ఆ దేశం 1776 లో ఏర్పడింది. అంటే దాని చరిత్ర 250 ఏండ్లే. ప్రస్తుతం ఢిల్లీ అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తుండగా, బీజింగ్ కూడా వాషింగ్టన్‌తో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అయితే, ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల ఈ రెండు ఆసియా దేశాలు ఇప్పుడు పరోక్షంగా భారీ ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇంధన సరఫరాలో ఏర్పడుతున్న ఆటంకాలు భారత్, చైనాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా వ్యూహాల వల్ల పురాతన నాగరికతలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
మాట మార్చిన ట్రంప్
భారత్, చైనాపై జాత్యహంకార పోస్ట్‌ను రీపోస్ట్ చేసి దుమారం రేపిన ట్రంప్.. గంటల వ్యవధిలోనే తన మాట మార్చారు. భారత్ ఒక గొప్ప దేశమంటూ ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ ధ్రువీకరించారు. భారత అగ్రనేత(మోదీ)తో తనకు మంచి స్నేహం ఉందని, భారత్ చాలా గొప్ప దేశమని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు, మైఖేల్ వివాదాస్పద వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దాంతో ట్రంప్ ఇలా మాట మార్చినట్టు తెలుస్తోంది. భారత్‌ను అవమానించిన కొద్దిసేపటికే స్నేహగీతం అందుకోవడం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

