ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ముందు ఘోర ప్రమాదం.. మైదానం పైనుంచి పడిన జవాన్.. స్పాట్లోనే మృతి

ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ముందు ఘోర ప్రమాదం.. మైదానం పైనుంచి పడిన జవాన్.. స్పాట్లోనే మృతి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం సాన్ ఆంటోనియోలోని అలమోడోమ్ (Alamodome) స్టేడియంలో నిన్న (2026, అక్టోబర్ 17, శనివారం) రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలేజ్ అమెరికన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగిన సైనిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. స్టేడియం పైకప్పు (Rafters) నుంచి తాళ్ల సాయంతో కిందకు దిగే (Rappelling) విన్యాసాలు చేస్తుండగా ఒక మిలిటరీ అధికారి (యుఎస్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మ్యాన్) అదుపుతప్పి మైదానం పైనుంచి కింద పడిపోయాడు.  తీవ్రగాయాలపాలైన అతడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించినట్లు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ధృవీకరించింది.   

సెల్యూట్ టు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వేడుకల్లో విషాదం: 

* యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ సాన్ ఆంటోనియో (UTSA), నావీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు సెల్యూట్ టు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అండ్ వెటరన్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 

* జాయింట్ బేస్ సాన్ ఆంటోనియో-క్యాంప్ బుల్లిస్‌కు చెందిన 6వ కాంబాట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ (Detachment 2) కు చెందిన నలుగురు అధికారులు స్టేడియం పైకప్పు నుంచి త్రాడు సాయంతో కిందకు దిగే ప్రదర్శన చేపట్టాల్సి ఉంది.

* మ్యాచ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందు ఈ విన్యాసం చేస్తుండగా, ఒక సైనికుడు రోప్‌పై పట్టు కోల్పోయి దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నేరుగా మైదానంలోని టర్ఫ్‌పై పడిపోయాడు.

నిశ్శబ్దంలో స్టేడియం:

ఈ ఘటన జరగగానే స్టేడియంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్యాండ్ మేళా వాయిస్తున్న కళాకారులు ఒక్కసారిగా ప్రదర్శనను నిలిపివేశారు. వెంటనే స్పందించిన మెడికల్ సిబ్బంది మైదానంలోనే ప్రాథమిక చికిత్స అందించి, ఆ తర్వాత స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాల (Life-threatening injuries) కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సదరు ఎయిర్‌మ్యాన్ తుదిశ్వాస విడిచాడు.   

విచారణకు ఆదేశించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్: 

* ఈ విషాదకర ఘటనపై UTSA విశ్వవిద్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు, సిబ్బందికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. 

* ప్రమాదానికి గల కారణాలు, తాడు అదుపుతప్పడానికి గల పరిస్థితులపై అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ విచారణకు ఆదేశించింది. దాదాపు 10 నిమిషాల జాప్యం తర్వాత ఫుట్‌బాల్ మ్యాచ్ పునఃప్రారంభమైంది.