V6 News

అమెరికాకు గుడ్ బై చెబుదాం!..యూఎస్ వీడాలని 40% మంది భారతీయ అమెరికన్ల యోచన

అమెరికాకు  గుడ్ బై  చెబుదాం!..యూఎస్ వీడాలని 40% మంది భారతీయ అమెరికన్ల యోచన
  •     యూఎస్​ను వీడాలని 40% మంది భారతీయ అమెరికన్ల యోచన 
  •     ట్రంప్ ప్రభుత్వ తీరు, రాజకీయ అనిశ్చితి, 
  • భారీగా పెరుగుతున్న జీవన వ్యయమే కారణం
  •     కార్నెగీ ఎండోమెంట్, యూగొవ్ సర్వేలో వెల్లడి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌ రెండోసారి బాధ్యతలు చేపట్టాక విదేశీ సంతతి పౌరులు అగ్రరాజ్యాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. పెరుగుతున్న జీవనవ్యయం, రాజకీయ అస్థిరత, సామాజిక భద్రత లేకపోవడం వంటి కారణాలతో దాదాపు 40% మంది భారతీయ అమెరికన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నారు. కార్నెగీ ఎండోమెంట్, యూగోవ్ సంయుక్తంగా 1000మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం అమెరికాలో 52 లక్షల మందికిపైగా భారత సంతతి పౌరులు ఉన్నారు. వీరిలో దాదాపు 40% మంది దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనుకున్నట్టు సర్వే తెలిపింది. 14% మంది తరచుగా దేశం వదిలి వెళ్లాలని ఆలోచిస్తుండగా.. 26 శాతం మంది అప్పుడప్పుడు ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.  

రాజకీయ వాతావరణంపై నిరాశ 

వలస వెళ్లాలనుకునే వారిలో 58 శాతం మంది అమెరికా రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు వీరిని కలవరపెడుతున్నాయి. దాదాపు 71 శాతం మంది ఆర్థిక వ్యవస్థ, వలస విధానాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘అమెరికా అమెరికన్లకే’ అనే ధోరణి పెరగడం వల్ల తాము పరాయివారిగా మారుతున్నామనే భావన వ్యక్తమవుతోంది. 

భారీగా పెరుగుతున్న జీవన వ్యయం..  

జీవనవ్యయం భారీగా పెరగడం కూడా అగ్రరాజ్యాన్ని వదిలి వెళ్లడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌‌‌‌‌‌‌‌, న్యూయార్క్ వంటి సిటీల్లో ఒక బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఫ్లాట్ అద్దె 3 నుంచి 5 వేల డాలర్లు (2.82 లక్షల నుంచి 4.70 లక్షల) ఉండటం భారంగా మారింది. అమెరికాలో ఒక బిడ్డను పెంచడానికి అయ్యే ఖర్చు ప్రస్తుతం మూడు లక్షల డాలర్లు (సుమారు రూ.2.8కోట్లు) దాటిపోతుందని అంచనా. ద్రవ్యోల్బణం (21%), ఉద్యోగ భద్రత (17%) వంటి అంశాలు భారతీయ అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇమిగ్రేషన్ చిక్కులు, వివక్ష.. 

దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్నప్పటికీ గ్రీన్ కార్డ్ జారీలో జాప్యం, వీసా విధానాల్లో అనిశ్చితి వంటివి నైపుణ్యం కలిగిన భారతీయులను విసుగెత్తిస్తోంది. వర్క్‌‌‌‌‌‌‌‌ ప్లేసేస్, సోషల్ మీడియాలో వివక్ష, భద్రతపై ఆందోళనలతో 41% మంది స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.