- కిమ్ ఆంక్షలతో సామాన్యుల జీవితం నరకంలా ఉందని ఆవేదన
సియోల్: ఉత్తర కొరియాలోని కఠిన నిబంధనలు, ఆకలి కేకలు, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ఉన్అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు ఒక కుటుంబం చేసిన సాహసం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా 9 మంది సభ్యులు ఉన్న ఒకే కుటుంబం, సముద్ర మార్గం గుండా ప్రాణాలకు తెగించి దక్షిణ కొరియాకు చేరుకుంది. కిమ్ పాలన నుంచి ఎలాగైనా బయటపడాలని పదేండ్లు రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నిరీక్షణకు కేవలం 2 గంటల్లో ముగింపు పలికారు. 2023 మే 6న పక్కా ప్లాన్‌తో పడవలో ఎక్కారు. దాన్ని అత్యంత వేగంగా నడుపుతూ ఉత్తర కొరియా సైనికుల కళ్లుగప్పి ఎల్లో సీ మీదుగా సరిహద్దు దాటారు. దక్షిణ కొరియా జలాల్లోకి ప్రవేశించారు. పారిపోయిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. వీరు 2023లోనే దక్షిణ కొరియా చేరినప్పటికీ, ఎస్కేప్ అయ్యేందుకు పదేండ్ల పాటు వారు వేసిన ప్లాన్, పిల్లలను ధాన్యపు బస్తాల్లో దాచి తీసుకురావడం వంటి కష్టాల గురించి పూర్తి వివరాలను ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పంచుకోవడంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
పట్టుబడితే మరణశిక్షే అని తెలిసినా..
ఉత్తర కొరియా సరిహద్దుల్లో నిరంతరం సైనిక నిఘా ఉంటుంది. పట్టుబడితే మరణశిక్ష తప్పదని తెలిసినా, ఆ కుటుంబం చాకచక్యంగా వ్యవహరించింది. వాతావరణం అనుకూలించిన సమయం చూసుకుని, చిన్న చేపల పడవలో సముద్రంలోకి ప్రవేశించారు. దక్షిణ కొరియా నౌకాదళం వారిని గుర్తించి, సురక్షితంగా తమ భూభాగంలోకి చేర్చుకుంది.
తమ దేశంలో ఆహార కొరత, నిర్బంధాలు, పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కుటుంబసభ్యులు వెల్లడించారు. కిమ్ కఠిన ఆంక్షల వల్ల సామాన్యుల జీవితం నరకప్రాయంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కుటుంబం దక్షిణ కొరియా నిఘా వర్గాల పర్యవేక్షణలో ఉంది. వారు నిజంగానే శరణార్థులా లేక కిమ్ పంపిన చొరబాటుదారులా అనే కోణంలో విచారిస్తున్నారు. ఏదేమైనా, మృత్యువు అంచున నిలబడి వారు సాధించిన ఈ విముక్తి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

