- ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో విద్య, వైద్యం, రహదారులు, భవనాలు, సంక్షేమ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో మంజూరైన 6,203 ఇందిరమ్మ ఇండ్లలో ఇంకా గ్రౌండింగ్ కాని 1,340 ఇండ్లను వెంటనే ప్రారంభించాలని, ఆర్థికంగా వెనుకబడిన వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు.
సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటు, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని సూచించారు. నిధుల విడుదల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వం నుండి వాటిని మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా మంజూరైన 21 పాఠశాలల పనులను వేగవంతం చేయాలని, ‘శ్రమ యోగి మంథన్ యోజన'పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించాలని, ప్రజా ప్రతినిధులందరికీ ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులకు అటవీ శాఖ అనుమతులు లభించేలా చూడాలన్నారు. జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రి, పెబ్బేరులోని 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. బ్యాంకర్లు తమ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టడంపై ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్కలెక్టర్లు వినోద్ కుమార్, ఖీమ్యా నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, బ్యాంక్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

